IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!

  • దేశవ్యాప్తంగా 11% వర్షపాత లోటు
  • పశ్చిమంలో భారీ వర్షాలు.. ఉత్తరాదిలో ఎండలే
  • ఆగస్టు 3 నుంచి ఉత్తరాదికి వర్షాల ఊరట
  • రుతుపవనాల కదలికలో అసమానతలు స్పష్టం
Weather

Weather

IMD Weather Update : దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ, వాటి ప్రభావం మాత్రం అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో వాన చుక్క కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఫలితంగా అనేక చోట్ల వేడి, తీవ్రమైన ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈసారి రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉండటంతో జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 11 శాతం వర్షపాత లోటు నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఇస్రో సంయుక్తంగా విడుదల చేసిన ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహ చిత్రాలు దేశంలోని ఈ అసమాన వర్షపాత చిత్రాన్ని స్పష్టంగా చాటిచెబుతున్నాయి.

నార్త్‌లో ఎండలు.. పశ్చిమాన మేఘాల పలకరింపు

వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, సాధారణంగా జూన్ 4 నుంచి ఇప్పటివరకు దేశంలో 446.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 395.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే పశ్చిమ, మధ్య భారతదేశంపై దట్టమైన మబ్బులు ఆవరించి ఉండటం కనిపిస్తుండగా, గంగా-సింధు మైదాన ప్రాంతాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో మాత్రం ఆకాశం చాలా నిర్మలంగా, నిర్మేఘంగా ఉంటోంది. ప్రస్తుతం గుజరాత్ పరిసర ప్రాంతాల్లో ఒక వాతావరణ వ్యవస్థ క్రియాశీలకంగా ఉండటంతో అక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కానీ వాయువ్య భారతంలో మాత్రం రుతుపవనాల కదలిక మందగించడంతో పొడి వాతావరణమే రాజ్యమేలుతోంది.

రాబోయే రోజుల్లో ఉత్తరాదికి ఊరట?

ఉత్తరాది ప్రజలకు ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే.. రుతుపవన ద్రోణి మెల్లగా ఉత్తరం వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు పుంజుకునే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆగస్టు 2 నుంచి ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీల్లో తేలికపాటి జల్లులు ప్రారంభమై, ఆగస్టు 3 నుంచి 5 మధ్య వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి. ఆయా ప్రాంతాల్లో 40 నుంచి 70 శాతం ప్రదేశాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (40-100 మి.మీ.) కురిసే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ, మధ్య రాజస్థాన్‌లలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉంది. మొత్తం మీద పశ్చిమ ప్రాంతాలు కుండపోత వానలతో సతమతమవుతుంటే, ఉత్తరాది ప్రాంతాలు మాత్రం సమృద్ధిగా వర్షాలు పడతాయనే ఆశతో ఎదురుచూస్తున్నాయి.