Site icon NTV Telugu

Indian Judicial System: ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు..

Supreme Court

Supreme Court

Indian Judicial System: భారతీయ న్యాయ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లతో సతమతమవుతోంది. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది న్యాయమూర్తులు ఉన్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఉండాల్సిన సంఖ్య కన్నా ఇది తక్కువ. సకాలంలో న్యాయం జరగాలంటే జనాభాకు తగినంత మంది జడ్జీలు లేరని తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 2026 నాటికి ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని లెక్కించినట్లు కేంద్రం తెలిపింది.

Read Also: Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం..

అధికారిక వివరాల ప్రకారం, సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 33 మంది మాత్రమే ఉన్నారు. హైకోర్టులో 1122 మంది న్యాయమూర్తులు ఉండాలి, కానీ ప్రస్తుతం 814 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అత్యధిక కేసులు జిల్లా, దిగుమ కోర్టుల్లోనే ఉన్నాయి. ఈ కోర్టుల్లో 20,833 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అయినా కూడా పెండింగ్ కేసులు తగ్గించడానికి ఈ సంఖ్య సరిపోవడం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన కోర్టుల్లో గణనీయంగా న్యాయమూర్తుల కొరత ఉంది. లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 120వ నివేదికలో ప్రతీ 10 లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని సూచించింది. ఈ సంఖ్యలో సగం కూడా ప్రస్తుతం లేరు. కొర్టులపై ఉన్న ఒత్తిడి జైళ్లలో కనిపిస్తోంది. నేషనల్ క్రైమ్ బ్యూర్(NCRB) ప్రకారం, 2023 నాటికి 3,89,910 మంది అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలో ఉన్నారు. సత్వర న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. కోర్టుల మౌలిక సదుపాయాలను మెరుగుపరడచంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాకారంతో పాటు పారదర్శకతను మెరుగుపరచడానికి ఈ-కోర్టులు మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ద్వారా టెక్నాలజీని తీసుకువస్తోంది.

Exit mobile version