Internet User: భారతదేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏకంగా 95 కోట్ల మంది దేశంలో ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగడం, పెరుగుతున్న షార్ట్ వీడియో వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్((AI) స్వీకరణ పెరగడం వంటి కారణాలతో 2025లో భారత ఇంటర్నెట్ యూజర్లు సంఖ్య 95 కోట్ల మైలురాయిని దాటినట్లు గురువారం ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది.
‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025’ను కర్ణాటక ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ/బీటీ అండ్ సైన్స్ & టెక్నాలజీ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యదర్శి మంజుల ఎన్ ఈ రిపోర్టును ఇండియా డిజిటల్ సమ్మిట్‌లో విడుదల చేశారు. భారత్‌లో ప్రస్తుతం 95.8 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇది సుమారు 8 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ స్థానం మరింత బలోపేతం అయింది.
Read Also: NCP Crisis: పవార్ మరణం తర్వాత ‘‘పవర్’’ పాలిటిక్స్.. డిప్యూటీ సీఏంగా సునేత్ర పవార్..!
44 శాతం మంది వినియోగదారులు వాయిస్ సెర్చ్, ఇమేజ్ ఆధారిత సెర్చ్, చాట్‌బాట్‌లు, ఏఐ ఫిల్టర్స్, ఏఐ-ఎనెబుల్డ్ ఫీచర్‌లను వాడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా గ్రామీన ప్రాంతాల్లో పెరుగుతున్న యూజర్లు, ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతున్నారని నివేదిక తెలిపింది. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే దాదాపుగా 55 కోట్ల మంది క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. గ్రామీణ వినియోగదారులే 57 శాతం ఉన్నట్లు చెప్పింది. పట్టణ యూజర్ల కన్నా గ్రామీణ యూజర్ల పెరుగుదల నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.
15-24 ఏళ్ల వయసువారిలో 57 శాతం, 25-44 ఏళ్ల వయసు వారిలో 52 శాతం మంది ఏఐ ఫీచర్లను ఉపయోగిస్తున్నట్లు నివేదిక తెలిపింది. డిజిటల్ వినియోగంలో ముఖ్యంగా షార్ట్ వీడియో కంటెంట్ కీలక వృద్ధి కారకంగా ఉందని చెప్పింది. డిజిటల్ వాడకానికి ముఖ్యంగా యువతే ప్రధాన కారణంగా మారిందని వెల్లడించింది. ఇదే కాకుండా ఇ-కామర్స్ వినియోగం చాలా పెరిగిందని, ఇది సాంప్రదాయ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌ను దాటి విస్తరిస్తోందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో 56 శాతం మంది గతేడాది ఆన్‌లైన్ షాపింగ్ చేశారు.
19.3 కోట్ల మంది మల్టీ డివైస్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇది మొత్తం యాక్టివ్ యూజర్లలో 20 శాతంగా ఉంది. 2024లో ఇది 16.5 కోట్లుగా ఉండేది. పట్టణాల్లో మల్టీ డివైజ్ వినియోగం 31 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 12 శాతం ఉంది. ఇదిలా ఉంటే, 18 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇతరుల మొబైల్ ద్వారా ఇంటర్నెట్ షేర్ ద్వారా సేవల్ని పొందుతున్నారు. వీరిలో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. భారత జనాభాలో 38 శాతం, అంటే సుమారుగా 57.9 కోట్ల మంది ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నారు.
