Site icon NTV Telugu

Fighter jets: భారత్‌కు 5వ తరం ఫైటర్ జెట్స్ ఎందుకు అవసరం.. అమెరికా F-35, రష్యా su-57లో ఏది బెటర్..

Amca

Amca

Fighter jets: ప్రస్తుతం యుద్ధ వ్యూహాలు మారుతున్నాయి. అత్యాధునిక ఆయుధాలే కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇప్పుడు 5వ తరం స్టెల్త్ యుద్ధవిమానం అవసరం. ముఖ్యంగా, పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ఈ కొత్త తరం ఫైటర్ జెట్ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే 5 వ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. భారత్ కొనుగోలు చేయాల్సి వస్తే అమెరికా, రష్యా నుంచే తీసుకోవాలి. భారత్ తన సొంత 5వ తరం అత్యాధునిక ఫైటర్ జెట్‌ కోసం AMCA ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అయితే, దశాబ్ధకాలం కానిదే మన సొంత ఫైటర్ జెట్ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు, చైనా తన 6వ తరం ఫైటర్ జెట్‌ని పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read Also: US Tariffs: భారత ఆర్థిక వ్యవస్థపై “డెడ్ ఎకానమీ” వ్యాఖ్య.. ట్రంప్‌ను విమర్శిస్తున్న సొంత దేశస్థులు..!

అమెరికా, రష్యా విమానాల్లో ఏది ఎంచుకోవాలి..?

అమెరికా వద్ద F-35, రష్యా వద్ద Su-57 ఫైటర్ జెట్లు ఉన్నాయి. రెండు దేశాలు కూడా భారత్‌కి ఈ అత్యాధునిక ఫైటర్ జెట్స్ అమ్మాలని చూస్తున్నాయి. అయితే, భౌగోలిక, వ్యూహాత్మక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ దేశం నుంచి మనం కొనుగోలు చేసినా కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. మన ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా నుంచి Su-57 ఫైటర్ జెట్‌ని భారత్ కొనుగోలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఎందుకంటే, భారత్ తన ఆయుధాలు, టెక్నాలజీలో ఎక్కువగా రష్యాపై ఆధారపడి ఉంది. రష్యా నుంచి ఫైటర్ జెట్ కొంటే రష్యన్ ఆయుధాలతో అనుసంధానం సులువు అవుతుంది. మరోవైపు, రష్యా నుంచి కొనుగోలు చేస్తే, అమెరికాకు ఆగ్రహం వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా, కాట్సా నిబంధనల్ని భారత్‌పై విధించి, ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.

మరోవైపు, అమెరికన్ F-35 విమానాలను ఎంచుకుంటే, అది ఎక్కువగా రష్యన్-దిగుమతి చేసుకున్న రక్షణ వస్తువులతో మ్యాచ్ కాలేకపోవచ్చు. దీనికి తోడు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీని మెయింటనెన్స్ కూడా అధికం. ఇటీవల, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఈ ఎఫ్-35 ఫైటర్ జెట్ సాంకేతిక కారణాలతో 20 రోజుల పాటు నిలిచిపోయింది. దీని ద్వారా చూస్తే ఈ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది.

మన ఫైటర్ జెట్‌ కోసం ప్రయత్నాలు:

రక్షణ రంగంలో ‘‘ఆత్మనిర్భర్’’గా మారేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే భారత్ AMCA ప్రాజెక్టును చేపట్టింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఐదవ తరం స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ కావడంతో, ఇది అన్ని వాతావరణాలలో పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ మరియు సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో రూపొందించబడిన AMCA, ఫ్రంట్‌లైన్ సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్‌లకు వారసుడిగా పరిగణించబడుతుంది.

Exit mobile version