India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!

India Defense Budget

India Defense Budget

India Defense Budget: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకోవడంలో నిమగ్నమయ్యాయి. తాజాగా స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025లో ప్రపంచ దేశాల మొత్తం సైనిక వ్యయం 2,887 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా 11వ ఏడాది కూడా ఈ ఖర్చు పెరగడం గమనార్హం. భారతదేశం 2025లో తన రక్షణ బడ్జెట్‌ను 8.9 శాతం పెంచి, మొత్తంగా 92.1 బిలియన్ డాలర్లకు చేర్చింది. దీంతో ప్రపంచంలోనే రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న మొదటి ఐదు దేశాల్లో భారత్ నిలిచింది.

టాప్-5 దేశాలు ఇవే
అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్. ఈ ఐదు దేశాలే ప్రపంచ మొత్తం రక్షణ వ్యయంలో 58 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

భారత్ – పాక్ ఉద్రిక్తతల ప్రభావం..
మే 2025లో భారత్ – పాకిస్థాన్ మధ్య తలెత్తిన సైనిక ఉద్రిక్తతలు, డ్రోన్లు, క్షిపణి దాడుల వంటి పరిణామాలు భారత్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పాకిస్థాన్ కూడా తన రక్షణ బడ్జెట్‌ను 11 శాతం పెంచి 11.9 బిలియన్ డాలర్లకు చేర్చింది. చైనా నుంచి కొత్త ఆయుధాల కొనుగోలు పాక్ వ్యయం పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఉక్రెయిన్‌కు అందాల్సిన కొత్త సాయం మంజూరు కాకపోవడంతో అమెరికా రక్షణ ఖర్చు 7.5 శాతం తగ్గి 954 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో డ్రాగన్ కంట్రీ తన సైనిక వ్యయాన్ని 7.4 శాతం పెంచి 336 బిలియన్ డాలర్లకు చేర్చింది. చైనా రక్షణ బడ్జెట్ పెరగడం ఇది వరుసగా 31వ ఏడాది కావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా రక్షణ సెగ
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తమ జీడీపీలో సగటున 2.5 శాతం రక్షణ రంగంపైనే ఖర్చు చేస్తున్నాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో ఖర్చు పెరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం, నాటో దేశాల సన్నద్ధత కారణంగా ఐరోపాలో రక్షణ వ్యయం 14 శాతం పెరిగింది. ఆసియా – ఓషియానియా ప్రాంతాల్లో 8.1 శాతం వృద్ధి నమోదైంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత, యుద్ధ భయాలు దేశాలను ఆయుధాల వేటలో పడేలా చేస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.