INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం

  • నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర
  • సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
  • భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
Indiabloc

Indiabloc

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విపక్ష ఇండియా కూటమి సోమవారం సుప్రీంకోర్టు వైపు నిరసన మార్చ్ చేపట్టంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 12న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు మెట్రో స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లు మూసేసింది. ఈ స్టేషన్లలో ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణకు అనుమతి ఉండదు. అయితే మెట్రో మార్గాలను మార్చుకునేందుకు అవసరమైన ఇంటర్‌చేంజ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా సంస్థలు పరిస్థితిని సమీక్షించిన తర్వాత అవసరమైతే తదుపరి ప్రకటనలు జారీ చేస్తామని తెలిపారు.

మరోవైపు ఢిల్లీలోని ఐటీవో, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. డీడీయూ మార్గ్‌లో నిరసన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని, దారి మళ్లింపు బోర్డులను గమనించాలని అధికారులు సూచించారు. రద్దీని నివారించేందుకు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు.

‘ఓట్ చోరీ’ ఆరోపణలపై విపక్షాల మార్చ్
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఎన్నికల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఇండియా కూటమి ఈ నిరసన మార్చ్‌కు పిలుపునిచ్చింది. ‘చలో ఢిల్లీ – మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానానికి బదులుగా పేపర్ బ్యాలెట్ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కోరుతున్నాయి.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఈ అంశాలపై వినతిపత్రం సమర్పించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమయం కేటాయించాలని వారు అభ్యర్థించారు. అయితే ఇదే తరహా అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున అపాయింట్‌మెంట్ అభ్యర్థనను సీజేఐ తిరస్కరించినట్లు తెలుస్తోంది. పరిపాలనా పరమైన మార్గంలో ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదని, న్యాయ ప్రక్రియ ద్వారా కోర్టును ఆశ్రయించాలని రాహుల్ గాంధీకి సూచించినట్లు సమాచారం. ఈ అంశాన్ని మంగళవారం విచారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.