NTV Telugu Site icon

Asia power index: జపాన్‌ని అధిగమించి ‘‘మూడో శక్తివంతమైన’’ దేశంగా భారత్..

Asia Power Index

Asia Power Index

Asia power index: ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతి పెరుగుతోంది. ఇప్పుడున్న ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత చొరవ లేకుండా ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆర్థికం బలపడటంతో పాటు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటం భారత్ గొప్పతనం. ఇదిలా ఉంటే ‘‘ఆసియా పవర్ ఇండెక్స్’’ రీజినల్ పవర్స్‌లో భారతదేశం సత్తా చాటింది. జపాన్‌ని దాటేసి మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించింది. ఆర్థిక పునరుద్ధరణ, మల్టీలాట్రల్ డిప్లమసీ భారత ప్రభావాన్ని మరింత పెంచింది. ప్రపంచంలో ఏ దేశానికి లేనట్టుగా భారత్ ఇటు రష్యాతో, అటు ఉక్రెయిన్‌తో స్నేహం చేయగలుతుంది.

Read Also: Asaduddin Owaisi: కాశీ బోర్డులో అందరూ హిందువులే.. వక్ఫ్‌లో ముస్లిమేతరులు ఎందుకు?

భారత్ ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానానికి చేరడానికి బలమైన ఆర్థిక వృద్ధి, యువ జనాభా, ప్రాంతీయ భద్రతా విషయాలు ప్రధాన కారణాలయ్యాయి. ఇది భారత భౌగోళిక రాజకీయ స్థాయిని ప్రభావాన్ని పెంచడంతో పాటు మెరుగుపరుస్తుంది. “ఒక పెద్ద మార్పు, ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారతదేశం జపాన్‌ను అధిగమించి మూడవ అతిపెద్ద శక్తిగా అవతరించింది, ఇది పెరుగుతున్న భౌగోళిక రాజకీయ స్థాయిని ప్రతిబింబిస్తుంది” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. 2018లో లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పవర్ డైనమిక్స్ రేటింగ్స్ ఇస్తోంది. ఇది ఆసియా-పసిఫిక్ అంతటా 27 దేశాలను అంచనా వేస్తుంది. కోవిడ్ మహమ్మారి వల్ల అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతిన్న తరుణంలో, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగ్గా ఉంది. ఇది కూడా పవర్ ఇండెక్స్ రేటింగ్‌కి కారణమైంది.