NTV Telugu Site icon

Waqf Bill: “1500 ఏళ్ల దేవాలయం వక్ఫ్ ఆస్తి ఎలా అవుతుంది..? ” ఉదాహరణలతో విరుచుకుపడిన బీజేపీ..

Waqf Bill

Waqf Bill

Waqf Bill: వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించేందుకు, ఈ రోజు వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీతో సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించాయి. ఈ బిల్లు రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. మతస్వేచ్ఛని హరిస్తున్నట్లుగా పేర్కొంది. ఇదిలా ఉంటే ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదని అధికార బీజేపీ చెప్పింది. 1995 వక్ఫ్ చట్టంలోని పలు నిబంధనలను సవరించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు వక్ఫ్ బోర్డులో మహిళకు ప్రాతినిధ్యం, వక్ఫ్ ఆస్తుల ప్రకటనపై సర్వే ఇలా పలు అంశాలను బిల్లులో తీసుకురాబోతోంది.

అయితే, ప్రతిపక్షాల ఆందోళనకు కేంద్రం ఘాటుగానే బదులిచ్చింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, తమిళనాడులోని ఆలయం ఉదంతంతో పాటు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాహరణలను ప్రస్తావించారు. వక్ఫ్ సంస్థల ద్వారా ఆక్రమణలని, అక్రమాలను సభలో చెప్పారు. ‘‘తమిళనాడులో తిరుచురాపల్లి జిల్లా ఉంది. అక్కడ 1500 ఏళ్ల నాటి సుందరేశ్వర ఆలయం ఉంది. ఒక వ్యక్తి తన ఆస్తిని విక్రయించేందుకు వెళ్లాడు. ఆ తర్వాత మొత్తం గ్రామం వక్ఫ్ ఆస్తి అని తెలిసింది. ఇక్కడ మతాన్ని చూడొద్దు’’ అని ఆయన అన్నారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించబడింది, ఇది మీరు ఊహించగలరా..? ఇది ఎలా జరుగుతుంది..? అని ప్రశ్నించారు.

Read Also: Congress Leader: షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

తాను బౌద్ధుడినని, హిందువు, ముస్లింని కాదని అన్ని మతాలను గౌవరిస్తానని, దీన్ని మతపరమైన అంశంగా చూడొద్దని ఆయన అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రైవేట్ ఆస్తులా… మున్సిపల్ కార్పొరేషన్ వక్ఫ్ ఆస్తిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని 1976 నాటి విచారణ నివేదికను కూడా మంత్రి సూచించారు. వక్ఫ్ బోర్డుల్లో మరింత ప్రాతినిధ్యం కోసం సచార్ కమిటీ సిఫార్సులను ఆయన ప్రస్తావించారు. ఈ కమిటిని కాంగ్రెస్ పాలనలోనే వేశారని చెప్పారు.

ముస్లింలలో షియా, సున్నీ, బోహ్రా, అగాఖానీ మరియు ఇతర వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపాదిత చట్టంలోని నిబంధనను ప్రస్తావిస్తూ.. ఒక వర్గం చిన్న వర్గాలను అణిచివేస్తుంటే, ఈ పార్లమెంట్ ఎలా అనుమతించగలదు…? అని ప్రశ్నించారు. వక్ఫ్ అధికారుల పట్ల ముస్లిం వర్గాల్లోనే అసంతృప్తి ఉందన్నారు. ఈ బిల్లలోని అంశాలు మత స్వేచ్ఛకు భంగం కలిగించవని లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించవని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డులు మాఫియాగా మారాయని అన్నారు.