NTV Telugu Site icon

Mallikarjun Kharge: అర్థరాత్రిలోగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలి.. ప్రధానికి కాంగ్రెస్ అల్టిమేటం..

Kharge

Kharge

Mallikarjun Kharge: రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానించారని కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు అంబేద్కర్ ఫోటోలతో నిరసన తెలిపారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే, బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. దళితుల ఐకాన్ అంబేద్కర్‌పై ప్రధాని నరేంద్రమోడీకి విశ్వాసం ఉంటే అర్ధరాత్రిలోగా అమిత్ షాని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రధాని, అమిత్ షాని తొలగించకుంటే ప్రజలు వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు.

Read Also: Kishan Reddy: అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు..

‘‘అమిత్ షా క్షమాపణ చెప్పాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై ప్రధాని మోదీకి విశ్వాసం ఉంటే అర్ధరాత్రి ఆయనను బర్తరఫ్ చేయాలని మా డిమాండ్.. కేబినెట్‌లో కొనసాగే హక్కు ఆయనకు లేదు.. ఆయన్ను బర్తరఫ్ చేయాలి, అలా అయితేనే ప్రజలు సైలెంట్‌గా ఉంటారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోసం ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.’’ అని ఖర్గే అన్నారు.

మరోవైపు ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ అంతే ధీటుగా సమాధానం ఇస్తోంది. ‘‘కాంగ్రెస్, దాని కుళ్లిన వ్యవస్థ హానికరమైన అబద్ధాలను, అనేక ఏళ్లుగా చేసిన దుర్మార్గాలను దాచాలని భావిస్తోంది. ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్‌ని అవమానం పరిచి తీవ్రంగా తప్పు చేశారు.’’ అంటూ ప్రధాని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ఒక రాజవంశం, ఒక పార్టీ సాధ్యమైన ప్రతీ డర్టీ ట్రిక్స్ చేసిందో భారత ప్రజలు పదేపదే చూశారని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.