Site icon NTV Telugu

Minister Rajendra Gudha: రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు, తిరుగుబాటుకు రూ.60 కోట్ల ఆఫర్..!

Minister Rajendra Gudha

Minister Rajendra Gudha

ఎన్నికల్లో ప్రలోభాలు అనేది ఓపెన్‌ సీక్రెట్.. అది లోకల్‌బాడీ ఎలక్షన్స్‌లో ఓలా.. ఎమ్మెల్యే ఎన్నికల్లో మరోలా.. ఎంపీ ఎన్నికల్లో ఇంకోలా అన్నట్టుగా.. ఎన్నికలను బట్టి రేటు మారుతుంది.. ఇక, ఎంపీపీ, జెడ్‌పీపీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల పంట పండిందంటూ అనే కథనాలు వస్తుంటాయి.. అంతేకాదు.. పెద్దల సభ ఎన్నికల్లోనే ఓటు ధర భారీగా ఉందని తాజాగా ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. నా రాజ్యసభ ఓటు కోసం రూ. 25 కోట్లు ఆఫర్ చేశారంటూ రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంతే కాదు.. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేస్తే.. రూ.60 కోట్లు ఇస్తామంటూ మరో ఆఫర్‌ కూడా వచ్చిందని బయటపెట్టారు. అయితే, తాను రెండు ఆఫర్లను తిరస్కరించానని, కానీ, ఆరోపణ చేస్తున్నప్పుడు ఏ నాయకుడిని లేదా పార్టీని ప్రస్తావించలేనన్నారు రాజేంద్ర గూడా.

Read Also: Rs 2,000 notes: రూ.2 వేల నోట్లపై అసలు విషయం బయటపడింది..!

రాజస్థాన్ సైనికుల సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజేంద్ర గూడా.. జుంజునులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.. మంగళవారం వెలువడిన ఓ వీడియోలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. “నా ఓటు ఒక వ్యక్తికి ఇవ్వడానికి 25 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది.. నేను నా భార్యను అడిగాను.. వారు “సద్భావన” కలిగి ఉంటారని ఆమె తనతో చెప్పిందన్నారు.. ఇక, గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ చేసిన తిరుగుబాటును కూడా ఆయన ప్రస్తావించారు. “రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నప్పుడు, నాకు 60 కోట్ల రూపాయల ఆఫర్ ఉందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను మా కుటుంబంతో మాట్లాడాను. నా భార్య, కొడుకు, కూతురికి డబ్బు కాదు సద్భావన కావాలి అన్నారని వెల్లడించారు. మీతో ఉన్నవారు అలా ఆలోచించినప్పుడు, అంతా బాగానే ఉంటుంది.. అని అతను పాఠశాల విద్యార్థితో చెప్పారు మంత్రి రాజేంద్ర.

కాగా, 2019లో కాంగ్రెస్‌లో చేరారు రాజేంద్ర… జూలై 2020లో పైలట్ మరియు 18 మంది ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అతని నాయకత్వంపై తిరుగుబాటు చేసినప్పుడు వారు గెహ్లాట్ శిబిరంలోనే ఉన్నారు. 2021 నవంబర్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలో మాజీ సైనికుల సంక్షేమ శాఖను నిర్వహిస్తూ రాజేంద్ర గూడా రాష్ట్ర మంత్రిగా చేశారు. ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఆఫర్ చేస్తూ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గెహ్లాట్ పదే పదే ఆరోపించిన విషయం తెలిసిందే.. జూన్‌లో నాలుగు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, మీడియా బారన్ సుభాష్ చంద్రకు బీజేపీ మద్దతు ఇచ్చింది… కానీ, చంద్ర ఓటమి పాలయ్యారు.. రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి ముగ్గురు అధికార కాంగ్రెస్ అభ్యర్థులు మరియు ఒక బిజెపి అభ్యర్థి విజయం సాధించిన విషయం విదితమే.. కానీ, ఇప్పుడు మంత్రి రాజేంద్ర గూడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Exit mobile version