హీరో సూర్య నటించిన “వీడొక్కడే” సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో హెరాయిన్ స్మగ్లింగ్ చేసేందుకు హీరో సూర్య స్నేహితుడు చేసిన విధంగానే ఓ మహిళ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది.. వివరాల్లోకి వెళితే.. ఉగాండా దేశానికి చెందిన ఓ మహిళ ఢిల్లీ ఐ పోర్టుకు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ లో సదరు ప్రయాణికురాలి పై అనుమానం కలగడంతో కస్టమ్స్ బృందం అదుపులోకి తీసుకొని విచారణ చేసింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను క్యాప్ సెల్స్ లో నింపి నల్లటి కవర్ లో చుట్టి హ్యాండ్ బ్యాగ్ లో దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్ లో దాచిన హెరాయిన్ గుట్టును అధికారులు రట్టు చేశారు.
అయితే సదరు మహిళ అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హెరాయిన్ తో నింపబడిన 38 క్యాప్ సెల్స్ మింగినట్లు ఆ మహిళ కస్టమ్స్ అధికారులకు వెల్లడించింది. దీంతో 3 రోజుల శస్త్రచికిత్స అనంతరం కడుపులో దాచిన 38 క్యాప్ సెల్స్ తో నింపబడిన హెరాయిన్ ను వైద్యులు బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికురాలిని వైద్యులు ప్రాణాలతో కాపాడారు. ఆమె వద్ద 7 కోట్ల విలువ చేసే 1 కేజీ హెరాయిన్ ను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.. ప్రయాణికురాలి పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ను ఢిల్లీ లో ఎవరికి అందిస్తుంది అనే సమాచారాన్ని కస్టమ్స్ బృందం స్వేకరిస్తోంది.
