NTV Telugu Site icon

Daaku Haseena: 10 రూపాయల ఫ్రూటీ.. రూ. 8 కోట్ల దోపిడీ నిందితుల్ని పట్టించింది.. ఎలాగో తెలుసా..?

Daaku Haseena

Daaku Haseena

Daaku Haseena: పంజాబ్ లో రూ. 8 కోట్ల దోపిడీ ఇటీవల కలకలం సృష్టించింది. డాకు హసీనాగా పేరొందిన మన్ దీప్ కౌర్, ఆమె భర్ జస్విందర్ సింగ్ ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. అయితే వీరు దోపిడి అనంతరం పారిపోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పంజాబ్ పోలీసులు వీరిని పట్టుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే కేవలం రూ.10 ఫ్రూటీ డ్రింక్, రూ. 8 కోట్ల దోపిడీ నిందితులను పట్టించేలా చేసింది. పంజాబ్ పోలీసులు పన్నిన ఉక్కులో నిందితులు పట్టుబడ్డారు.

జూన్ 10న లూథియానాలో రూ. 8.49 కోట్లు దోపిడికి గురయ్యాయి. ఈ కేసులో డాకు హసీనాగా పిలువబడే మన్ దీప్ కౌర్ కీలకంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ లోని చమోలీలోని హేమ్‌కుండ్ సాహిబ్‌కు వెళుతుండగా మన్‌దీప్ కౌర్, ఆమె భర్త జస్విందర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు పంజాబ్‌లోని గిద్దర్‌బాహాకు చెందిన మరో నిందితుడు గౌరవ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పట్టించిన ఫ్రీ డ్రింక్..

దోపిడి అనంతరం మన్‌దీప్‌ కౌర్‌, ఆమె భర్త జస్విందర్‌ సింగ్‌ నేపాల్‌కు పారిపోవాలని ప్లాన్‌ చేశారని పంజాబ్‌ పోలీసులకు సమాచారం అందింది. అయితే అంతకుముందు వీరు హరిద్వార్, కేదార్ నాథ్, హేమకుంట్ సాహిబ్‌లతో సహా వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని హేమకుంట్ సాహిబ్‌ సిక్కు మందిరాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే వీరిలో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాల్ గా మారింది. కాగా వీరిని గుర్తించేందుకు పోలీసులు ఉచిత డ్రింక్ సదుపాయాన్ని కల్పించారు.

ఇదే సమయంలో నిందితులు డ్రింక్ స్టాల్ వద్దకు వచ్చారు. వీరు తనమ ఐడెంటిటీ తెలియకుండా ముఖాలను కప్పుకున్నారు. ఈ సమయం ఉచిత డ్రింక్ ను తీసుకున్న వీరిద్దరు దాన్ని తాగేందుకు ముఖానికి ఉన్న మాస్కులు తీయాల్సి వచ్చింది. ఈ సమయంలో పోలీసులు నిందితులను గుర్తించారు. ఆ తరువాత నిందితులను పోలీసులు వెంబడించారు.

పోలీసులు గుర్తించిన వెంటనే నిందితులను అరెస్ట్ చేయలేదు. కొంతదూరం వెంబడించిన తర్వాత అరెస్ట్ చేశారు. మన్ దీప్ కౌర్, జస్వీందర్ సింగ్ లను పట్టుకునేందుకు ‘లెట్స్ క్యాచ్ క్వీన్ బీ’(రాణి తేనెటీగను పట్టుకుందాం) అనే ఆపరేషన్ నిర్వహించారు. లూథియానా పోలీస్ కమిషనర్ మన్ దీప్ సింగ్ సిద్దూ చెప్పిన వివరాల ప్రకారం.. మన్‌దీప్ కౌర్ ద్విచక్ర వాహనంలో రూ.12 లక్షలు, ఆమె భర్త జస్విందర్ సింగ్ బర్నాలా ఇంటి నుంచి రూ.9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఎవరీ ‘డాకు హసీనా’:

రూ. 8.49 కోట్ల లూథియానా దోపిడీ వెనక నిందితుల్లో డాకు హసీనాగా పిలువబడే మన్ దీప్ కౌర్ ఉన్నారు. ఆమె జూన్ 10న న్యూ రాజ్ గురు నగర్ ప్రాంతంలో సీఎంఎష్ సెక్యురిటీస్ కంపెనీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను బందీగా ఉంచింది. ధనవంతురాలు కావాలనే ఆశతో ఆమె నేరాలకు పాల్పడింది. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా, లాయర్ కి అసిస్టెంట్ గా పనిచేసింది. ఆమెకు ఈ ఏడాది జస్వీందర్ సింత్ తో వివాహం జరిగింది.