ICU Admit: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ICU)లో రోగిని చేర్చుకోవడంపై కొత్తగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రోగి కండీషన్ విషమంగా ఉన్న పరిస్థితుల్లో ఐసీయూలో చేర్చి డాక్టర్లు చికిత్స అందిస్తుంటారు. ఇలా ఐసీయూలో చేరికపై 24 మంది నిపుణులు చర్చించి కొత్తమార్గదర్శకాలను జారీ చేశారు. ఈ కొత్త మార్గదర్శకాల్లో రోగి బంధువుల ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురై రోగులకు సంబంధించి వారి బంధువులు నిరాకరిస్తే ఆస్పత్రుల్లోని ఐసీయూలో చేర్చుకోలేరని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీయూ అడ్మిషన్లపై ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో పాటు రోగికి తదుపరి చికిత్స సాధ్యం కాని పక్షంలో లేదా చికిత్స అందుబాటులో లేనప్పుడు, చికిత్స రోగి ఆరోగ్యంపై ఫలితం చూపకపోతే, ముఖ్యంగా అతని మనుగడపై ప్రభావం చూపించకుంటే ఐసీయూల్లో ఉంచడం వ్యర్థమని నిపుణుల బృందం సిఫారసు చేసింది. జీవించే అవకాశం లేనప్పుడు ఐసీయూల్లో చేర్చుకోకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా, మహమ్మారి, విపత్తు పరిస్థితులు, వనరులు పరిమితంగా ఉన్న సమయంలో రోగిని ఐసీయూలో ఉంచడానికి తక్కువ ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.
Read Also: Tokyo-Haneda airport: టోక్యో ఎయిర్‌పోర్టులో ఘోరం.. ఢీకొట్టుకున్న రెండు విమానాలు..
రోగికి అవయవ వైఫల్యం, ఆర్గాన్ సపోర్ట్ సమయంలో లేదా వైద్య పరిస్థితి క్షీణతను అంచనా వేయడంపై ఐసీయూలో చేర్చుకోవడం ఆధారపడి ఉండాలని సూచించింది. రోగి అపస్మారక స్థితి, హేమోడైనమిక్ ఇన్‌స్టెబిలిటీ, శ్వాస కోసం మద్దతు, తీవ్రమైన అనారోగ్యం బారిన పడిన రోగులకు ఇంటెన్సివ్ మానిటరింగ్, లేదా ఆర్గాన్ సపోర్ట్ లేదా వైద్య పరిస్థితి క్షీణతకు అవకాశం ఉన్న వ్యాధులను ప్రమాణంగా తీసుకుని ఐసీయూల్లో అడ్మిషన్ చేసుకోవాలని సూచించింది. ఇవే కాకుండా కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ ఇన్‌స్టెబిలిటీ, పెద్ద సర్జరీలు చేయించుకున్న రోగులను కూడా ఐసీయూ అడ్మిషన్ ప్రమాణాల్లో చేర్చారు.
రోగి లేదా బంధువలు ఐసీయూలో చేరడానికి నిరాకరించిన సమయంలో, చికిత్స ప్రణాళిక ముగియడం, విపత్తుల సమయలో వనరులు పరిమితంగా ఉన్నప్పుడు ఐసీయూల్లో చేర్చకూడదని మార్గదర్శకాలు చెబుతున్నాయి. మార్గదర్శకాల ప్రకారం.. ఐసీయూలో చేర్చుకునే రోగులకు ముందు రక్తపోటు, పల్స్ రేటు, శ్వాసకోశ రేటు, శ్వాస విధానం, హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ సాచురేషన్, యూరిన్ అవుట్ పుట్ ఇతర పారామిటర్స్‌ని పర్యవేక్షించాలని సూచించింది.