NTV Telugu Site icon

UP Police: ‘‘హోలీ ఏడాదికి ఒకసారి, శుక్రవారం నమాజ్ 52 సార్లు’’.. ఇబ్బంది ఉంటే ఇంట్లో ఉండండి..

Up

Up

UP Police: హోలీ పండగ, రంజాన్ మాసంలో శుక్రవారం నమాజ్ ఒకే రోజు కలిసి రావడంతో మతపరమైన సున్నిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువగా ఉంటాయి. గతేడాది నవంబర్ నెలలో సంభాల్ జామా మసీదు సర్వే సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో నలుగురు వ్యక్తులు మరణించడంతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత యోగి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సంభాల్ ప్రాంతంలో అధికారుల సర్వేల్లో పురాతన దేవాలయాలు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే, హోలీ, రంజాన్ మాసంలో శుక్రవారం నమాజ్ కలిసి వస్తున్న నేపథ్యంలో పండగను దృష్టిలో పెట్టుకుని సంభాల్ కొత్వాలి పోలీస్ స్టేషన్ గురువారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ‘‘హోలీ అనేది ఏడాదికి ఒకేసారి వచ్చే పండగ, శుక్రవారం ప్రార్థనలు ఏడాదిలో 52 సార్లు జరుగుతాయి. హోలీ రంగులతో ఎవరైనా ఇబ్బంది అని భావిస్తే, ఆ రోజు ఇంటిలోనే ఉండండి. బయటకు వచ్చే వారు విశాల దృక్పథంతో ఉండాలి. ఎందుకంటే పండగలు కలిసి జరుపుకోవాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు.

Read Also: Crime: కాళ్లలో 10 మేకులు.. మహిళ మృతదేహం.. చేతబడి కారణమా..?

అయితే, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శాంతిభద్రతలను కాపాడటానికి మత సామరస్యం, కఠినమైన నిఘా అవసరాన్ని అనుజ్ చౌదరి నొక్కి చెప్పారు. వేడుకలు సజావుగా జరిగేందుకు నెల రోజుల్లో వివిధ స్థాయిల్లో శాంతి కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. రెండు వర్గాల భావాలను గౌరవించాలని ప్రజల్ని కోరారు. ఇష్టం లేని వారిపై రంగులు వేయొద్దని చెప్పారు. “ముస్లింలు ఈద్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లే, హిందువులు హోలీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు రంగులు పూసుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ, ఆనందాన్ని పంచుకుంటూ జరుపుకుంటారు. అదేవిధంగా, ఈద్ రోజున, ప్రజలు ప్రత్యేక వంటకాలు తయారు చేసుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని వేడుక చేసుకుంటారు. రెండు పండుగల సారాంశం కలిసి ఉండటం మరియు పరస్పర గౌరవం” అని ఆయన అన్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి శర్వేంద్ర బిక్రమ్ సింగ్ ఖండించారు. పోలీసులు బీజేపీ ఏజెంట్లుగా వ్యవహరించొద్దని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసి, పక్షపాతాన్ని ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు లౌకికంగా ఉండాలని, లేదంటే అరాచకవాదానికి దారి తీస్తుంది అని యూపీ కాంగ్రెస్ మీడియా కమిటీ వైస్ చైర్మన్ మనీష్ హింద్వీ అన్నారు. పోలీసులు రాజకీయ ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు.