Sanjauli Mosque Row: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం ముదురుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారని చెబుతూ, స్థానిక ప్రజలు, హిందూ గ్రూపు, బీజేపీ తీవ్ర నిరసనలు చేస్తోంది. అయితే, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తోంది. ఈ వివాదం రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. చట్టవిరుద్ధమైన ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వందలాది మంది నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
సబ్జీ మండి ఢల్లి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. నిరసన తెలిపేందుకు సంజౌలి మసీదు వైపు మార్చ్ చేశారు. వివాదాస్పద ప్రాంతం వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరసనకారులు వీటిని బద్దలు కొట్టి ముందుకు వెళ్లారు. అయితే, మసీదు సమీపంలోని రెండో బారికేడ్‌ని బద్దలు కొట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటర్ క్యానన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు.
Read Also: BJP: జార్ఖండ్‌లో బీజేపీ కీలక నిర్ణయం.. అభ్యర్థులను ఎన్నుకోనున్న కార్యకర్తలు
ఈ వివాదం పెద్దది కావడంతో మత ఉద్రిక్తతలు పెరగకుండా నగర వ్యాప్తంగా పోలీస్ బందోబస్తును పెంచారు. సిమ్లా జిల్లా యంత్రాంగం భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163ని విధించింది. ఐదుగురు కన్నా ఎక్కువ మంది సమావేశాన్ని నిర్వహించకుండా, మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై బీజేపీ విరుచుకుపడుతోంది. మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ఈ మసీదు వివాదంపై ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంత మంత్రి అనిరుద్ధ్ సింగ్ అసెంబ్లీలో నిలదీశారు. ఈ మసీదును అనధికారికంగా నిర్మించారని ఆరోపించారు. కూల్చివేయాలని కోరారు, మసీదు నిర్మాణం కోసం ఎక్కడ నుంచి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. లవ్ జిహాద్ కేసులతో పాటు మార్కెట్ ఏరియాలో మహిళలు నడవలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.