Site icon NTV Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Uttarakhand

Uttarakhand

Uttarakhand: నైరుతి రుతుపవనాలతో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల రహదారులు మూతబడ్డాయి. దీంతో అధికారులు హరిద్వార్‌కు అలర్ట్ ను ప్రకటించింది. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగడంతో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు ఢిల్లీలో యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయి పైనే ప్రవహిస్తుండగా.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌ లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో అలకనంద నదిపై ఉన్న జీవీకే హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ డ్యామ్‌ నిండటంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో దేవప్రయాగ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. హరిద్వార్‌ లో గంగానది వార్నింగ్‌ స్థాయి అయిన 293 మీటర్లను దాటి ప్రమాదకరంగా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు అలర్ట్‌ జారీ చేశారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే శిబిరాలకు తరలించారు. హరిద్వార్‌, రూర్కీ, ఖాన్‌పుర్‌, భగవాన్‌పుర్‌, లస్కర్‌ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Read also: Bhanu Sri Mehra : సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను..

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా 17 రోడ్లు, తొమ్మిది వంతెనలు దెబ్బతిన్నాయి. అటు సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలకు నేడు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మళ్లీ ఉప్పొంగుతోంది. నీటిమట్టం ఇంకా ప్రమాదకర స్థాయి పైనే ఉంది. సోమవారం ఉదయం 8 గంటలకు నది నీటిమట్టం 205.50 మీటర్లుగా ఉండగా.. 9 గంటల సమయానికి 205.58 మీటర్లకు పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహంతో పాటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉండటంతో నీటిమట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాత ఢిల్లీ యమునా వంతెనకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

Exit mobile version