Site icon NTV Telugu

Israel: బ్రిటీష్ వారు కాదు, భారత సైనికులు మమ్మల్ని రక్షించారు.. ఇజ్రాయిల్ మేయర్..

Israel

Israel

Israel: ఇజ్రాయిల్ హైఫా యుద్ధంలో మరణించిన భారతీయ సైనికులకు అక్కడి ప్రజలు నివాళులు అర్పించారు. హైఫా నగరాన్ని ఒట్టోమన్ పాలన నుంచి విముక్తి చేసింది బ్రిటీష్ సైనికులు కాదని, భారతీయ సైనికులే అని హైఫా మేయర్ అన్నారు. దీని ఆధారంగా పాఠశాల చరిత్ర పుస్తకాలను మారుస్తానని మేయర్ యోనా యాహవ్ అన్నారు. భారతీయ సైనికుల్ని ఖననం చేసిన స్మశానంలో వారి ధైర్యసాహసాలకు నివాళులు అర్పించే కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో ఈటెలు, కత్తులతో సాయుధులైన భారతీయ అశ్వికదళ రెజిమెంట్ హైఫా నగరాన్ని విముక్తి చేసింది. ఒట్టోమన్ దళాలను ఓడించింది. దీనిని చాలా మంది యుద్ధ చరిత్రకారులు ‘‘చరిత్రలోనే చివరి గొప్ప అశ్వికదళ పోరాటం’’గా భావిస్తారు. 1918లో 15వ ఇంపీరియల్ సర్వీస్ అశ్వికదళ బ్రిగేడ్ చేసిన యుద్ధం హైఫాను విముక్తి చేసింది. మైసూర్, హైదరాబాద్, జోధ్‌పూర్ లాన్సర్ రెజిమెంట్లు ఇందులో పాల్గొన్నాయి. వీరిని గౌరవించుకునేందుకు ప్రతీ ఏడాది భారత సైన్యం ప్రతీ ఏడాది సెప్టెంబర్ 23ను హైఫా దినోత్సవంగా జరుపుకుంటుంది.

Read Also: Bomb Threats: 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు..

కెప్టెన్ అమన్ సింగ్ బహదూర్, దఫాదర్ జోర్ సింగ్‌లకు ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ (IOM) లభించింది. కెప్టెన్ అనోప్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ సాగత్ సింగ్‌లకు ఈ యుద్ధంలో వారి ధైర్యసాహసాలకు గుర్తింపుగా మిలిటరీ క్రాస్ (MC) లభించింది. హైఫా వీరుడిగా విస్తృత ప్రచారం చెందిన మేజర్ దల్పత్ సింగ్‌కు మిలటరీ క్రాస్ లభించింది. భారత దళాల ధైరసాహసాల వల్ల ఒట్టోమన్ దళాలు ఓటమి పాలైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో 74,000 మందికి పైగా భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. ఇజ్రాయిల్‌లోని హైఫా, జెరూసలేం, రాంలేలో భారత సైనిక స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఈ నగరాల్లోని స్మశానవాటికలలో సుమారు 900 మంది భారతీయ సైనికులను ఖననం చేశారు.

హైఫాలోని చరిత్ర పాఠ్యపుస్తకాలు 3 నుంచి 5 తరగతుల వరకు భారతీయ సైనికులు హైఫాను విముక్తి చేసిన కథల్ని బోధిస్తారు. ఇజ్రాయిల్‌తో స్నేహానికి ప్రతీకగా, 1992లో జరిగిన ఈ చారిత్రక యుద్ధానికి ప్రతీకగా న్యూఢిల్లీలోని ఐకానిక్ తీన్ మూర్తి చౌక్ పేరును “తీన్ మూర్తి హైఫా చౌక్”గా పేరు మార్చింది. 2018 జనవరిలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఢిల్లీ పర్యటన సందర్భంగా దీనిని నిర్మించారు.

Exit mobile version