Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. బెంగాల్ బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించడంలో, ఓటర్ల జాబితాను సవరించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇందుకు ఆయనను పద్మ అవార్డుతో సత్కరించాలని అన్నారు. ఆయనకు ‘పద్మ భూషన్’’ ఇవ్వాలని కోరారు.
పశ్చిమ బెంగాల్‌లో గతంలో ఎన్నికల సమయంలో భయం, ఒత్తిడి వాతావరణం ఉండేదని, ఇప్పుడు ప్రజలు ఎలాంటి హింస లేకుండా ఓటు హక్కును వినియోగించుకోగలుగుతున్నారని భట్టాచార్య అన్నారు. బెంగాల్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరిన వ్యక్తుల పేర్లు తొలగించడం అవసరమని అన్నారు. ఎన్నికల సంఘం అనర్హుల పేర్లు తొలగించిందని చెప్పారు.
ఇదిలా ఉంటే, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక రాజకీయ వేడిని పుట్టించింది. ఎస్ఐఆర్ సహా, ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎన్నికల కమిషన్లు సుఖ్‌బీర్ సింగ్ సందు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 10 సందర్భాల్లో ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఆదేశాలపై అభ్యంతరం తెలిపారని నివేదించింది. ఓటర్ల నమోదు, ఎస్ఐఆర్, పేర్ల తొలగింపు, ఫారం-6 మార్పులు, ఓటర్ల డేటా బేస్ వంటి అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి.
అయితే, ఈ నివేదికపై స్పందిస్తూ.. అంతర్గత చర్చల్లో వేర్వేరు అభిప్రాయాలు, సూచలను, లిఖితపూర్వక వ్యాఖ్యలు రావడం సాధారణ ప్రక్రియలో భాగమే అని చెప్పింది. ఎస్ఐఆర్ సహా అన్ని నిర్ణయాలను ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవ ఆమోదంతో తీసుకున్నారని ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు, ఈ వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

