Site icon NTV Telugu

Gwalior Restaurant Fined:శాఖాహార కుటుంబానికి చికెన్ కర్రీ.. రెస్టారెంట్‌కు భారీ జరిమానా!

Gwalior Restaurant Fined

Gwalior Restaurant Fined

Gwalior Restaurant Fined: పలు రెస్టారెంట్లు చాలా సార్లు తప్పుడు ఆర్డర్లు డెలివరీ చేయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఓ రెస్టారెంట్ తప్పుడు ఆర్డర్ చేసిన పాపానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వెజ్ కర్రీ ఆర్డర్ చేస్తే పొరపాటున చికెన్‌ కర్రీ పంపిన రెస్టారెంట్ భారీ మూల్యం చెల్లించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ అయిన జివాజీ క్లబ్ నుంచి శాఖహార భోజనాన్ని ఆర్డర్ ఇచ్చారు అడ్వొకేట్ సిద్ధార్థ శ్రీవాస్తవ. ఆయన కూడా జివాజీ క్లబ్‌లో సభ్యుడే. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా మటర్ పన్నీర్‌ను ఆర్డర్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే ఆర్డర్ డెలివరీ కావడంతో శ్రీవాస్తవ కుటుంబం దానిని విప్పి చూసి ఒక్కసారిగా షాకైంది. అందులో తాము ఆర్డర్ చేసిన మటర్ పనీర్‌కు బదులుగా చికెన్ కర్రీ రావడంతో వారు విస్తుపోయారు.

Gujarat Rains: రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

అడ్వకేట్ శ్రీవాస్తవది శాఖాహార కుటుంబం కావడంతో ఈ విషయంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని జివాజీ క్లబ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం వహించడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. క్లబ్ నిర్లక్ష్యం కారణంగా మానసికంగా, శారీరకంగా తమకు నష్టం వాటిల్లిందని శ్రీవాస్తవ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారించిన వినియోగదారుల ఫోరం పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ విషయంలో జివాజీ క్లబ్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారుల ఫోరం తెలిపింది. ఈ ఘటన వారిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీసిందని పేర్కొంటూ క్లబ్‌ కిచెన్‌కు రూ. 20వేల జరిమానా విధించింది. అంతేకాకుండా కేసుకు అయిన మొత్తాన్ని కూడా చెల్లించాలని ఆదేశించింది. దేశంలో ఇలా ఎన్నో ఘటనలు జరగడం మనకు తెలిసిన విషయమే.

Exit mobile version