Jnanpith Award: 2023కి గానూ ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యలకు 58వ జ్ఞానపీఠ్ అవార్డులను కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్ హిందీ సినిమాల్లో సినీగేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఉన్న ప్రసిద్ధ ఉర్దూ కవుల్లో ఒకరిగా ఉన్నారు. అంతకుముందు గుల్జార్‌కి 2002లో ఉర్దూ సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.
Read Also: Yash: పాన్ ఇండియా హీరో.. కుటుంబంతో కలిసి కిరాణా కొట్టులో ఏం చేస్తున్నాడు.. ?
గుల్జార్‌తో పాటు సంస్కృత సాహిత్యవేత్త జగద్గురు రాంభద్రాచార్యకు కూడా అవార్డును ప్రకటించింది. చిత్రకూట్ లోని తులసీ పీఠం వ్యవస్థాపకుడిగా, ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మికవేత్తగా, విద్యావేత్తగా 100 కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు. 2022లో గోవా రచయిత దామోదర్ మౌజో ఈ అవార్డును అందుకున్నారు.
జ్ఞానపీఠ్ అవార్డు భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం. భారతీయ సాహిత్యానికి విశేష కృషి చేసినందుకు భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్ ఈ అవార్డులను అందిస్తుంది. ఈ అవార్డును మొదటిసారిగా 1965లో మలయాళ కవి జి. శంకర్ కురుప్ తన ఒడక్కుఝల్ అనే కవితా సంకలనానికి పురస్కారం పొందారు. ఈ అవార్డును అందుకున్న వారికి రూ. 11 లక్షలతో పాటు, వాగ్దేవి కాంస్య విగ్రహాన్ని బహూకరిస్తారు.
