Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు

  • గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే
  • చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు
  • వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు
Gulmarg Gondola Ropeway

Gulmarg Gondola Ropeway

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గుల్మార్గ్‌లో గోండోలా కేబుల్ కార్ సేవలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడంతో వందలాది మంది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తెలిపారు.

ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, గోండోలా రోప్ వే లో ఉన్న అన్ని క్యాబిన్‌లు సురక్షితంగా ఉన్నాయని, అందులో చిక్కుకుపోయిన పర్యాటకులను దశలవారీగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. సాంకేతిక లోపం తలెత్తిన వెంటనే గుల్మార్గ్ గోండోలా సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. శిక్షణ పొందిన రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పర్యాటకుల్లో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

సుమారు 300 మంది పర్యాటకులు గోండోలా క్యాబిన్‌లలో ఉన్నట్లు సమాచారం. భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ వారిని ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గోండోలా సేవలను పునరుద్ధరించే ముందు పూర్తి సాంకేతిక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.