Site icon NTV Telugu

Constable Slaps Woman: మహిళను చెంప దెబ్బ కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. వైరల్ అవుతున్నవార్త

ప్రజల భద్రత కోసం విధులు నిర్వహించాల్సిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక మహిళపై చేయి చేసుకున్న ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని అంజలి చార్ రస్తా వద్ద ఈ సంఘటన జరిగింది. వాహన తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఒక మహిళను ఆపారు. ఆమె డ్రైవింగ్ లైసెన్స్ చూపాలని కోరగా, లైసెన్స్ వెతకడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. ఈ సమయంలో అక్కడ ఉన్న మహిళా పోలీసు అధికారిని ఆమె తన గుర్తింపు కార్డు చూపించాలని కోరింది.

గుర్తింపు కార్డును తిరిగి ఇచ్చే సమయంలో అది అనుకోకుండా మహిళ చేతి నుంచి జారి నేలపై పడింది. దీనితో ఆగ్రహానికి గురైన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అకస్మాత్తుగా ఆమెను చెంపపై కొట్టాడు. అంతటితో ఆగకుండా మరింత దాడి చేసేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న ఇతర పోలీసు సిబ్బంది అతడిని అడ్డుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల రక్షణ కోసం పని చేయాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version