Site icon NTV Telugu

Gujarat Cable Bridge Collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 35 మంది మృతి..

Gujarat

Gujarat

Gujarat Cable Bridge Collapse: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మరణాల సంఖ్య పెరుగతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో నదిలో మునిగిపోయి 35 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై మొత్తం 500 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో 400 మందిని రెస్క్యూ చేయగా.. మరో 100 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. రాజధాని అహ్మదాబాద్ నుంచి ప్రమాద స్థలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Read Also: T20 World Cup: టీమిండియాకు తొలి దెబ్బ.. దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆదివారం కావడంతో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ను సందర్శించేందుకు, నదీ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఐదు రోజుల క్రితమే వంతెనకు మరమ్మతులు చేసి, అధికారులు ప్రజల సందర్శనకు అనుమతించారు. అక్టోబర్ 26న గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే కొంతమంది నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలంలో బాధితులు బంధువుల రోదనలు మిన్నంటాయి.

నదిలో పడిన వారి భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు భాగం కావాలని సూచించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గుజరాత్ హోం మంత్రి హర్ష్ సఘవి, రాజధాని నుంచి మోర్బీ బయలుదేరారు. ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గుజరాత్ ప్రభుత్వం తరుపున సీఎం భూపేంద్ర పటేల్ కూడా మరణించిన వారికి రూ. 4లక్షల పరిహారాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version