Dance Record: కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చాలా మంది ఇప్పటికే నిరూపించారు. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండి.. కృషితో కఠోర సాధన చేస్తే తప్పకుండా సాధిస్తారు. అలా పట్టుదలతో నాట్యం నేర్చుకుంది.. ఏకధాటిగా డ్యాన్స్ చేసి గిన్నీస్ రికార్డు సాధించింది. 16 ఏళ్ల బాలిక విరామం లేకుండా ఏకధాటిగా 127 గంటలపాటు నాట్యం చేసి ఇండివిడ్యుయల్ కేటగిరీలో గిన్నిస్ రికార్డు సాధించింది. సాధించాలంటే కఠోర సాధన ఉండాలి. రికార్డు సాధనకు వయసు అనేది ప్రధానం కాదని సృష్టి సుధీర్ జగ్‌తాప్ నిరూపించింది. పదహారేళ్ల సృష్టి విరామం లేకుండా 127 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ (ఇండివిడ్యుయల్ కేటగిరీ)లో గిన్నిస్ రికార్డు సాధించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన సృష్టి… లాతూర్‌లోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది. ఆమె అమ్మానాన్న సుధీర్, సంజీవని ఇద్దరూ టీచర్లు. వాళ్ల తాతగారు ‘బాబన్ మనే’ స్వయానా నాట్యగురువు. సృష్టికి చిన్నప్పటి నుంచి నాట్యసాధన అలవాటయింది. కానీ ఆమెకు రికార్డు కోసం నాట్యం చేయాలనే ఆకాంక్షకు కారణం మాత్రం బందనా నేపాల్. ఆమె 2018లో 126 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో గిన్నిస్ రికార్డు సాధించింది. ఆమె నుంచి స్పూర్తి పొందినట్టు సృష్టి చెప్పింది.
Read also: Rajanna Sircilla: పునుగులు తింటూ 13 నెలల చిన్నారి మృతి..
బందనా నేపాల్ రికార్డు నాట్యం చేసినపుడు ‘భారతీయ నాట్యరీతులు లెక్కలేనన్ని ఉన్నాయి. మన నాట్యరీతికి ఓ రికార్డు ఉంటే బావుణ్ను. ఆ రికార్డు ద్వారా ప్రపంచదేశాలకు మన శాస్త్రీయ నాట్యం గురించి తెలుస్తుందనే ఆలోచన సృష్టిలో రేకెత్తింది. ఆమె ఆలోచనకు తల్లిదండ్రులు, తాత అండగా నిలిచారు. గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్య సాధన చేయాలనుకుంది. తాత పర్యవేక్షణలో 15 నెలల పాటు కఠోరసాధన చేసింది. ధ్యానంలో యోగనిద్ర కూడా సాధన చేయించారు బాబన్ మనే. రోజుకు నాలుగు గంటల సేపు ధ్యానం, మూడు గంటల సేపు వ్యాయామం, ఆరు గంటల సేపు నాట్యసాధన… ఇదీ రికార్డు కోసం ఆమె చేసిన దీక్ష. సృష్టి 127 గంటల నాట్య ప్రద్శన మే నెల 29వ తేదీన పోదార్ స్కూల్ వేదిక మీద మొదలైంది. నాట్యప్రదర్శన ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఆహారం అందక దేహం నీరసించి, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉండడానికి గంటకోసారి ఐదు నిమిషాల సేపు విరామం తీసుకునేది. ఆ విరామంలో ఎనర్జీ డ్రింక్ తీసుకుంటూ తన నాట్యదీక్షను కొనసాగించింది. సృష్టి నాట్యం చేసినంత సేపూ ఆమె తల్లిదండ్రులు వేదిక పక్కనే ఉండి ఆమెకు కావలసినవి అందిస్తూ వచ్చారు. నాట్య ప్రదర్శనను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగారికర్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ సృష్టిని ప్రశంసల్లో ముంచెత్తారు.
Read also: SEBI New Rule: స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు అలర్ట్.. సెబీ కొత్త రూల్స్
రికార్డు సాధనలో నా లక్ష్యం నెరవేరింది. ఐదు రోజుల ఐదు గంటల పాటు (విరామంతో కలిపి దాదాపు ఆరు రోజులు) సాగిన నాట్య ప్రదర్శన మధ్యలో అప్పుడప్పుడూ తల, శరీరం తూలిపోతున్న భావన కలిగాయి. కానీ నా లక్ష్యం 127 గంటలను పూర్తి చేయడం. లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో ఇండియాకు రికార్డు సాధించడం. దేహం నిస్సత్తువతో ఇకచాలనే సంకేతాలు జారీ చేసినప్పుడు నా లక్ష్యాన్ని గుర్తు చేసుకుని.. క్షణాల్లో నన్ను నేను సంబాళించుకున్నాను. మానసికంగా స్థిరంగా ఉంటే దేహం కూడా సహకరిస్తుందని పదహారేళ్ల సృష్టి స్పష్టం చేసింది.