పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను తొలగించాలంటూ కేంద్రానికి మూడు లేఖలు రాశామన్నారు సీఎం మమతా బెనర్జీ. గవర్నర్ ధన్‌కర్ అవినీతిపరుడని, 1996కు చెందిన హవాలా జైన్ కేసులో ఆయనపై చార్జ్‌షీట్లు కూడా ఉన్నాయని మమత ఆరోపించారు. బెంగాల్ గవర్నర్‌ను తొలగించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో కూడా బహిరంగంగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. బెంగాల్ అల్లర్లకు సంబంధించి కేంద్రానికి గవర్నర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని, గవర్నర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె గతంలో డిమాండ్ చేశారు. గవర్నర్ ధన్‌కర్- సీఎం మమతా బెనర్జీకి మధ్య పరిస్థితులు చాలా కాలంగా ఉప్పు నిప్పుగానే ఉన్నాయి.
అయితే, సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఖండించారు గవర్నర్ జగదీప్ ధంకర్. ముఖ్యమంత్రి ఆరోపణలు ఘోరంగా ఉన్నాయన్నారు. గొడవలు సృష్టించేందుకు… మమత ఇలాంటి ఆరోపణలు చేస్తారని తాను అనుకోలేదన్నారు. హవాలాకాండ్ కేసులో ఇప్పటివరకు ఎవరూ దోషులుగా నిర్ధారించబడలేదని అన్నారు గర్నవర్. కరోనా వైద్య పరికరాల కొనుగోలులో 2వేల కోట్ల విలువైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. బెంగాల్‌లో పోస్ట్ పోల్ హింసలు అందరూ చూస్తున్నారని, ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని అన్నారు బెంగాల్ గవర్నర్.