NTV Telugu Site icon

Parliament security: భద్రతా ఉల్లంఘన నేపధ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంట్ సెక్యూరిటీ..

Cisf

Cisf

Parliament security: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నలుగురు వ్యక్తులు పార్లమెంట్ లోపల, బయట హల్చల్ చేశారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులపై పార్లమెంట్ ఛాంబర్‌లోకి ప్రవేశించి పొగ డబ్బాలను పేల్చారు, మరో ఇద్దరు పార్లమెంట్ బయట ఇదే తరహా చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారితో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Read Also: Triple Talaq: సోదరుడికి కిడ్నీ దానం చేసినందుకు.. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

ఈ ఘటనతో పార్లమెంట్ భద్రతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు అధికార బీజేపీపై విమర్శలకు దిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ కాంప్లెక్స్ భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బందిని మోహరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ కేంద్ర మంత్రిత్వ శాఖ భవనాలు, అణు మరియు ఏరోస్పేస్, ఎయిర్ పోర్టులు, ఢిల్లీ మెట్రో లాంటి పలు ప్రాంతాల్లో భద్రతను ఇస్తోంది. ఇటీవల పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించిన తర్వాత సమగ్ర భద్రత కోసం సీఐఎస్ఎఫ్ బలగాలకు సెక్యూరిటీ విధుల్ని అప్పగించాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలియజేశాయి.

సీఐఎస్ఎఫ్‌కి చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ(జీబీఎస్) యూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు కలిసి ఈ వారంలో సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత, కొత్త పార్లమెంట్ భవనాల భద్రతను సీఐఎస్ఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకోనుంది. సీఐఎస్ఎఫ్ కిందనే ప్రస్తుతం భద్రతను పర్యవేక్షిస్తున్న పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్‌కి చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ టీములు పనిచేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Show comments