సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కుక్కలు, పిల్లులు హల్‌చల్ చేస్తుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. చౌబేపూర్‌లోని ప్రభుత్వ కార్యాలయంలోకి మేక ప్రవేశించి మెల్లగా క్యాంటీన్ పక్కన ఉన్న గదికి చేరుకుంది. గదిలో ఉన్న ప్రభుత్వ ఫైల్‌ను నోటితో పట్టుకుంది. అనంతరం కార్యాలయం బయటకు పరుగెత్తుకు వెళ్లింది. అయితే మేక నోటి వెంట ఫైల్‌ను చూసిన ఓ ఉద్యోగి దాని వెనుక పరిగెత్తాడు. దీంతో అది కీలకమైన డాక్యుమెంట్ ఫైల్ అని భావించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాణం పోయినంత పనైంది.
ఈ నేపథ్యంలో మేక చేసిన పనికి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ముచ్చెమటలు పట్టాయి. మేక వెనకాలే పరుగెత్తుకుంటూ వెళ్లిన ఉద్యోగి చివరకు ఫైల్ డాక్యుమెంట్‌ను సాధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అది ప్రభుత్వ ఫైల్ కాదని… మాములు ఫైల్ అని తేలింది. కానీ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ కార్యాలయంలోకి మేక ప్రవేశించిందని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మనులాల్ యాదవ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటన ఈనెల 1వ తేదీన చోటుచేసుకుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మేకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.