Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!

Mahatma Gandhi

Mahatma Gandhi

Mahatma Gandhi: ప్రపంచ చరిత్రలోనే అత్యంత కర్కశ నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ పేరు వింటేనే విధ్వంసం, మారణహోమం గుర్తొస్తాయి. అలాంటి నియంతను ప్రపంచమంతా భయంతో చూస్తున్న తరుణంలో.. జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం కలం పట్టి నేరుగా ఆయనకే లేఖ రాశారు. అది కూడా అత్యంత ఆప్యాయంగా “డియర్ ఫ్రెండ్” (ప్రియమైన మిత్రమా) అని సంబోధిస్తూ! మానవాళిని సర్వనాశనం చేసే రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి అహింసా మూర్తి గాంధీజీ, ఆ నరరూప రాక్షసుడికి రాసిన ఆ రెండు లేఖల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఆ లేఖలు హిట్లర్ దాకా చేరాయా? నియంత నుంచి బాపూజీకి ఎలాంటి బదులు వచ్చింది? గాంధీ జయంతి వేళ చరిత్ర పుటల్లో పెద్దగా వెలుగుచూడని ఈ అరుదైన చారిత్రక ఘట్టం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ విషయాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

మొదటి లేఖ: ప్రళయం ముంచుకొస్తున్న వేళ (23 జూలై 1939)

రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు యూరప్‌ను కమ్మేస్తున్న సమయమది. తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతున్న తరుణంలో, ప్రపంచ శాంతి కోసం హిట్లర్‌ను కదిలించాలని పలువురు శ్రేయోభిలాషులు గాంధీజీని కోరారు. తన లేఖను ఎవరైనా పొగరుబోతుతనంగా భావిస్తారేమోనని మొదట కాస్త సంకోచించినా, మానవాళి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గాంధీజీ హిట్లర్‌కు మొదటి లేఖ రాశారు.

ఆ లేఖలో ఏముంది?
గాంధీజీ చాలా మర్యాదపూర్వకంగా “ప్రియమైన మిత్రమా” అంటూ లేఖను ప్రారంభించారు. “ఈ వినాశకరమైన యుద్ధాన్ని ఆపే శక్తి ఈ భూమ్మీద ప్రస్తుతానికి మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది. మీరు సాధించాలనుకున్న లక్ష్యం ఎంత విలువైందైనా కావచ్చు.. కానీ దానికోసం యావత్ మానవజాతిని అనాగరిక అంధకారంలోకి నెట్టేయడం న్యాయమేనా?” అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ లేఖ రాయడం తప్పయితే క్షమించమని కోరుతూనే, అధికారం చేతిలో ఉన్న నేతలే యుద్ధాన్ని నివారించాలనే బలమైన సందేశాన్ని పంపారు. కానీ విషాదం ఏమిటంటే.. ఈ లేఖ రాసిన కొద్ది రోజులకే జర్మనీ పోలాండ్‌పై దాడి చేసింది. దాంతో రెండో ప్రపంచ యుద్ధం భగ్గుమంది.

రెండో లేఖ: నియంత చర్యలపై నిప్పులు.. కానీ ద్వేషం లేకుండా! (24 డిసెంబర్ 1940)

యుద్ధం మొదలైన తర్వాత కూడా రక్తపాతం ఆగకపోవడంతో, 1940 క్రిస్మస్ ఈవ్ సందర్భంగా గాంధీజీ హిట్లర్‌కు రెండోసారి మరింత ఘాటుగా లేఖ రాశారు. ఈసారి కూడా “ప్రియ మిత్రమా” అనే సంబోధనతోనే మొదలుపెట్టారు.

స్నేహం అంటే మౌనం కాదు:
గాంధీజీ స్పష్టం చేస్తూ.. “నాకు ఎవరూ వ్యక్తిగత శత్రువులు కారు, ప్రతి మనిషితో మైత్రినే కోరుకుంటాను. అంతమాత్రాన మీ దురాగతాలను సమర్థిస్తున్నట్లు కాదు” అని కుండబద్దలు కొట్టారు. చెకోస్లోవేకియా, పోలాండ్, డెన్మార్క్‌లపై నాజీ సేనలు సాగించిన అకృత్యాలను అత్యంత అమానవీయమైనవని, మానవ గౌరవాన్ని కాలరాయడమేనని నిరసించారు. “మీరు సాధించే విజయాలను నేను ఎప్పటికీ కోరుకోలేను” అని నిర్మొహమాటంగా చెప్పారు. తాము బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ, బ్రిటిష్ ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని వివరించారు. హింసతో అధికారాన్ని నిలబెట్టుకోలేరని, ప్రజల సహకారం లేకపోతే ఏ నియంత పాలనా శాశ్వతం కాదని హిట్లర్‌కు అహింస అంతరార్థాన్ని బోధించే ప్రయత్నం చేశారు.

హిట్లర్ సమాధానం ఇచ్చాడా? ఆ లేఖలు అసలు చేరాయా?

చరిత్రకారుల కథనం ప్రకారం.. గాంధీజీ రాసిన లేఖలకు హిట్లర్ నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం వచ్చిన దాఖలాలు లేవు. అసలు ఆ లేఖలు హిట్లర్ చేతికి చేరాయా లేదా అన్నదానిపై కూడా స్పష్టత లేదు. అప్పట్లో భారతదేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ నిఘా వర్గాలు గాంధీజీ రాసిన ఈ లేఖలను మార్గమధ్యంలోనే అడ్డుకుని ఉండవచ్చని ఒక వాదన ఉంది. మరొక కథనం ప్రకారం.. లేఖలు హిట్లర్‌కు అందినప్పటికీ, హింసనే పరమావధిగా భావించే ఆ నియంత బాపూజీ మాటలను నిర్లక్ష్యం చేసి ఉంటాడని భావిస్తారు. గాంధీజీ రాసిన ఆ లేఖలు రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయాయి. అంతటి మహా నియంత మనసునూ మార్చలేకపోయాయి. కానీ, ఆయుధాల మోత మోగుతున్న వేళ కూడా అహింసా సిద్ధాంతాన్ని విడవకుండా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని సైతం ముఖాముఖి ప్రశ్నించే నైతిక ధైర్యం గాంధీజీకి మాత్రమే సాధ్యమైంది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ద్వేషం లేకుండా నిలదీసిన ఆ అక్షరాలు.. నేటికీ అంతర్జాతీయ వేదికలపై శాంతి, చర్చల ఆవశ్యకతకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.