Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీని తీసుకువచ్చే సమయం వచ్చిందని ఆయన మంగళవారం అన్నారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా యూసీసీని తీసుకురావాలని అన్నారు. ఐఐటీ గౌహతి 25వ కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు అనుగుణంగా దేశం అంతటా యూసీసీని ప్రవేశపెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే సివిల్ కోడ్ ఉండాలని సూచిస్తుందన్నారు.
Read Also: Iran: నకిలీ క్లినిక్ ముసుగులో మహిళలపై అత్యాచారం.. ముగ్గురికి ఉరిశిక్ష అమలు..
గత వారం ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశం రెండు చట్టాలపై నడవదని అన్నారు. రాజ్యాంగం కూడా ప్రజలందరికి సమానహక్కుల గురించి చెబుతుందని, యూసీసీ అమలుకు సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలిపిందని ప్రధాని గుర్తు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యూసీసీపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని అన్నారు. యూసీసీ అమలుకు ఇప్పటికే శివసేన(ఉద్ధవ్) పార్టీతో పాటు ఆప్ వంటి రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. మరోవైపు ముస్లిం సంఘాలు మాత్రం యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. జూలై 3వ వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును తీసుకురావడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది.