Site icon NTV Telugu

కేంద్ర మంత్రిపై మన్మోహన్‌సింగ్‌ కుటుంబం ఆగ్రహం.. అలాగేనా..?

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మహన్మోహన్ సింగ్‌.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆయనను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వ్యవహరించిన తీరుపై మన్మోహన్‌ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించిన సందర్భంగా మన్మోహన్‌ తో మంత్రి మాండవీయ ఫొటోలు తీయించుకోవడాన్ని తప్పుబట్టారు.. ఆ ఘటనపై మన్మోహన్‌ కుమార్తె దమన్ సింగ్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.. తన తండ్రి, మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. ఆయనను పరామర్శించేందుకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం.. ఆస్పత్రికి వచ్చారని.. అయితే, ఆయనతోపాటు ఫొటోగ్రాఫర్ ఉండటాన్ని గమనించిన తన తల్లి.. ఆ ఫొటోగ్రాఫర్‌ను అనుమతించవద్దని, ఫొటోలు తీయొద్దని వారించారని.. అయినా, ఆమె మాటలను పట్టించుకోకుండా తన తండ్రితో కలిసి మాండవీయకు ఫొటోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, మా నాన్న డెంగ్యూతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు దమన్ సింగ్.. కానీ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని.. ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో సందర్శకులను అనుమతించడం లేదన్నారు. తన తండ్రిని పరామర్శించేందుకు మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రావడం మంచి విషయమే.. కానీ, ఆ సమయంలో ఫొటోలు దిగే పరిస్థితిలో తన తల్లిదండ్రులు లేరన్న ఆమె.. ఫొటోగ్రాఫర్‌ను గది నుంచి పంపించేయాలని తన తల్లి ఎంతచెప్పినా వినకుండా.. ఫొటోలో దిగారని మండిపడ్డారు.. ఈ ఘటనపై ఆమె చాలా బాధపడ్డారని తెలిపారు.. మరోవైపు.. మన్మోహన్ సింగ్‌తో తాను తీయించుకున్న ఫొటోలను మంత్రి మాండవీయ.. సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.. దానిపై నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో.. మళ్లీ డెలిట్ చేసిన విషయం తెలిసిందే.. ఇక, మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని.. ఆయన కోలుకుంటున్నారని తాజా బులెటన్‌లో పేర్కొన్నారు ఎయిమ్స్‌ వైద్యులు.

Exit mobile version