NTV Telugu Site icon

Kejriwal: డబ్బుతో ఓట్లు కొనేవారికి బుద్ధి చెప్పండి.. ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు

Kejriwal

Kejriwal

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలను ఉద్దేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. గురువారం వీడియోలో ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Liquor Ban : సీఎం సంచలన నిర్ణయం.. 17 ప్రముఖ నగరాల్లో మద్యపాన నిషేధం

తాజాగా శుక్రవారం విడుదల చేసిన వీడియోలో ప్రత్యర్థి పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. నెలన్నర నుంచే డబ్బు, బూట్లు, బెడ్‌షీట్లు, చీరలు, రేషన్, బంగారం, గొలుసులు బహిరంగంగా పంపిణీ చేసిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ పట్ల వారికి భయంలేదని తెలిపారు. ఈ పంపిణీ అంతా పోలీస్ సంరక్షణలోనే జరిగిందన్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వారికి అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకున్న అవినీతి డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరేమీ ఇచ్చినా తీసుకోండి.. అంతేకానీ ఓటును మాత్రం అమ్ముకోవద్దని కోరారు. వారంతా అవినీతిపరులు, దేశద్రోహులు, దేశ శత్రువులు..అలాంటి వ్యక్తులు దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు మరియు దేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు భిన్నమైనవి అని గుర్తించి ఓటు వేయాలని కేజ్రీవాల్ కోరారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay : కరీంనగర్‌ను అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యం

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలా రెండు పార్టీల మధ్య హోరాహోరీగా పోరాటం సాగుతోంది. అయితే ఈ సారి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో చూడాలి.