Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయంతో పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత వైమానిక సంస్థలకు మూసేసింది.
పాక్ చర్యకు ప్రతీకారంగా భారత్ కూడా తన ఎయిర్‌స్పేస్‌ని పాకిస్తాన్‌కి చెందిన విమానాలకు మూసేసింది. ఈ నిర్ణయం వల్ల భారతదేశానికి చెందిన విమానయాన సంస్థలకు చెందిన అనేక విమానాలు పాకిస్తాన్ మీదుగా ప్రయాణించలేదు. దీని వల్ల ఉత్తర భారతదేశం నుంచి మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా, యూరప్, అమెరికాకు వెళ్లే విమానాలు గుజరాత్, ముంబై మీదుగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రయాణికులపై అదనపు సమయం, అదనపు ఖర్చు పడుతుంది. విమానయాన సంస్థలకు నష్టాలు వస్తాయి.
ఇదిలా ఉంటే, ఉద్రిక్తతల నడుమ విదేశాలకు చెందిన విమానయాన సంస్థలు కూడా పాకిస్తాన్ గగనతలాన్ని స్వచ్ఛందంగా వినియోగించుకోవడం లేదు. బదులుగా పాకిస్తాన్‌ని తప్పించుకుని భారత్‌కి వస్తున్నాయి. భారత విమానయాన సంస్థలే కాకుండా, ఇప్పుడు విదేశాలకు చెందిన విమాన కంపెనీలు కూడా ఇప్పుడు పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చాయి. అసలే ఆర్థికంగా దివాళా తీసిన దాయాది, ఇప్పుడు విమానయాన సంస్థలు చెల్లించే ఓవర్ ఫ్లైట్ ఫీజులను కోల్పోతోంది. దీని వల్ల ప్రతీ నెలా మిలియన్ డాలర్లను పాక్ కోల్పోతుంది.
గత రెండు రోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో లుప్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ వేస్, స్విస్, ఎయిర్ ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ఐటీఏ, పోలాండ్‌కి చెందిన LOT వంటి ప్రముఖ యూరోపియన్ విమానయాన సంస్థలు పాకిస్తాన్ మీదుగా ప్రయాణించలేదు. ఈ దెబ్బతో పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ వార్షిక ప్రాతిపదికన ఓవర్ ఫ్లైట్ ఛార్జీల కారణంగా వందల మిలియన్లు నష్టపోవచ్చు.ఫిబ్రవరి 2019లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరంపై భారతదేశం వైమానిక దాడి చేసిన తర్వాత, విమానయాన సంస్థలకు గగనతల నిషేధం కారణంగా పాకిస్తాన్ అధికారం ఐదు నెలల కాలంలో కనీసం 100 మిలియన్ డాలర్లను కోల్పోయింది.
