Bengaluru Crime: ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చి, ఇంట్లోకి చొరబడి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫ్లిప్‌కార్ట్ (Flipkart) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని విజయ్ మల్లికార్జున్ కామత్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పార్సిల్ డెలివరీ చేయడానికి ఆమె ఫ్లాట్‌కు వచ్చాడు. అనంతరం తాను వాష్‌రూమ్ వాడుకుంటానని మహిళను అడిగాడు. అయితే తాము అపరిచితులను ఇంట్లోకి రానివ్వమని చెబుతూ ఆమె అతడి రిక్వెస్ట్‌ను స్పష్టంగా తిరస్కరించింది. అయినప్పటికీ, ఆమె మాటలను లెక్కచేయని డెలివరీ ఏజెంట్.. బలవంతంగా చెప్పులు విప్పి ఇంట్లోకి చొరబడ్డాడు. వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ముందు నగ్న ప్రదర్శన చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. “నేను స్పష్టంగా వద్దు అని చెప్పినా వినకుండా హద్దులను దాటి ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో నా భద్రతపై నాకు చాలా భయం వేసింది. ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు పరుగెత్తి సహాయం కోరడానికి వీలుగా నేను మెయిన్ డోర్ తెరిచి ఉంచాను, అలాగే నా ఫోన్ కెమెరాను కూడా ఆన్ చేసి ఉంచాను” అని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది.
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు బెంగళూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై వైట్‌ఫీల్డ్ డీసీపీ స్పందిస్తూ.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 75, 79, 329(2) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ వేగంగా జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ దురదృష్టకర ఘటనపై ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విషయం తెలిసిన వెంటనే సదరు డెలివరీ బాయ్‌ని విధుల్లోంచి తక్షణమే తొలగించినట్లు సంస్థ ప్రకటించింది. బాధితురాలికి తాము పూర్తి మద్దతుగా నిలుస్తామని, పోలీసుల దర్యాప్తుకు అవసరమైన అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపింది. డెలివరీ ఏజెంట్లందరికీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, తప్పనిసరి శిక్షణ ఇస్తామని.. ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా జరిగినప్పటికీ, ఒక్కటి జరిగినా అది ఆమోదయోగ్యం కాదని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. కస్టమర్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన అదనపు చర్యలను సమీక్షిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

