FCRA Bill: FCRA బిల్లు కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా?.. ఎన్జీఓ, మిషనరీల్లో భయం, అమెరికాలో వ్యతిరేకత.. అసలేంటి ఈ బిల్లు..

  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక FCRA బిల్లు..
  • విదేశీ విరాళాల నియంత్రణ కోసం తీసుకువస్తున్న కేంద్రం..
Fcra Bill

Fcra Bill

FCRA Bill: నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ నిరసనలు, యువత నిరసనల కారణంగా రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కేసుల్లో చిక్కుకోవద్దని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే తాను రాజీనామా చేస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటు యువతతో పాటు ప్రతిపక్షాలు కూడా నిరసనలు చేపట్టాయి. పార్లమెంట్ నడవకుండా అడ్డుకుంటున్నారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు యువత నిరసన ఒక్కటే కారణం కాదని తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ‘‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026’’ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు ఎలాంటి వివాదాలు లేకుండా బిల్లును గట్టెక్కియాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కేంద్రం ఇటు జంతర్ మంతర్ వద్ద నిరసనలు, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనలతో సతమతం అవుతోంది.

FCRA బిల్లుతో పాటు పలు కీలక బిల్లులను కేంద్రం ఈ సమావేశాల్లో పాస్ చేయించాలని భావిస్తోంది. సోమవారం ఈ బిల్లులు పార్లమెంట్ ఉభయసభల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బిల్లుల విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా కేంద్రం ప్లాన్‌తో ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారనే వాదన కూడా ఉంది.

FCRA బిల్లు ఏమిటి..?

ఎఫ్‌సీఆర్ఏ (FCRA) అంటే Foreign Contribution (Regulation) Act (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో స్పష్టత, పారదర్శకత కోసం కేంద్రం తీసుకువస్తోంది. ముఖ్యంగా కొన్ని ఎన్జీఓలు, మత సంస్థలు, విద్యాసంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు స్వీకరించే విదేశీ నిధుల విషయంలో కేంద్రం నియమాలను నిర్దేశిస్తుంది.

విదేశీ నిధులు దేని కోసం స్వీకరిస్తున్నారో, ఆ పనికే కేటాయించాలని ఈ బిల్లు సూచిస్తుంది. ఏ రాష్ట్రం, ఎక్కడి ప్రజల కోసం నిధులు స్వీకరించారో వాటి కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా కొత్త బిల్లులో నియమాలను రూపొందిస్తుంది. విదేశీ నిధులు దేశభద్రత, రాజకీయ వ్యవస్థలు, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూడటం ఈ బిల్లు లక్ష్యం. విదేశీ నిధుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరిగేలా చేయడం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువస్తోంది. ప్రతీ ఏడాది ఆదాయం, ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. నిబంధనల్ని ఉల్లంఘిస్తే సదరు ఎన్జీవో లేదా వేరే ఏదైనా సంస్థ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేయనున్నారు.

FCRA రిజిస్ట్రేషన్ రద్దయినా, గడువు ముగిసినా లేదా ఇతర కారణాలతో చెల్లుబాటు కాకపోయినా, సంబంధిత సంస్థ విదేశీ నిధులు, ఆస్తులపై ప్రభుత్వం నియంత్రణ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేక అధికారిని నియమించే ప్రతిపాదన బిల్లులో ఉంది. అవసరమైతే ఆ ఆస్తుల్ని విక్రయించి, వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం తన నియమాల ప్రకారం వినియోగించే అవకాశాన్ని కొత్త బిల్లు కల్పిస్తుంది.

ప్రభుత్వం ఏం చెబుతోంది..?

విదేశీ నిధుల విషయంలో చాలా రోజులుగా అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ నిధుల్ని దేశ ప్రయోజనాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మత సంస్థలు మతమార్పిడికి ఈ నిధుల్ని వాడుకుంటున్నారని కేంద్రం ఆరోపిస్తోంది. నిజానికి ఢిల్లీలో 2021 షాహీన్ భాగ్ అల్లర్ల సమయంలో, సీఏఏ నిరసనల్లో విదేశీ నిధులు ఉపయోగించారనే ఆరోపణ ఉంది.

ఎన్జీఓలు, క్రైస్తవ మిషనరీల భయం ఏమిటి..?

FCRA సవరణ చట్టంపై ఎన్జీఓలు, క్రైస్తవ మిషనరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇది మత స్వేచ్ఛ, పౌర సమాజ సంస్థల స్వతంత్రత దెబ్బతీసే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ప్రభుత్వం విస్తృత అధికారాలను పొందుతుందని, న్యాయపరమైన సమీక్ష లేకుండానే సంస్థల ఆస్తులపై చర్యలు తీసుకునే అవకాశం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బిల్లును వ్యతిరేకిస్తున్న అమెరికన్ నేతలు:

ఈ బిల్లును మన దేశంలోని సంస్థలే కాదు, అమెరికా డెమోక్రటిక్ నేతలు కూడా భారత్ తీసుకువస్తున్న FCRA బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అమెరికాకు చెందిన రిలిజియస్ ఫ్రీడమ్ ఇన్‌స్టిట్యూట్ (RFI) ఈ బిల్లును వ్యతిరేకించాలని భారత్‌లోని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ బిల్లు ఆమోదమైతే విదేశీ విరాళాలు స్వీకరించే మతపరమైన, స్వచ్ఛంద సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ సంస్థ పేర్కొంది. ఆర్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు డేవిడ్ ట్రింబుల్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు ఈ బిల్లు విరుద్ధమని అన్నారు. అమెరికా క్రైస్తవులు కూడా దీనిపై తమ స్వరం వినిపించాలని డేవిడ్ ట్రింబుల్ పిలుపునిచ్చారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు క్రిస్ స్మిత్ కూడా గతంలో విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు లేఖ రాస్తూ భారత్‌లో ఈ బిల్లును అడ్డుకునేలా పనిచేయాలని అన్నారు.