జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో జరిగిన అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. పురుషులు, మహిళలు చిన్న చిన్న దుస్తులతో ర్యాంప్‌పై నడిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి షోలకు ఎలా అనుమతి ఇస్తారని విపక్షాల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాకుండా అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఇక నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక విలువలను నాశనం చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫ్యాషన్ షో ద్వారా ప్రజలు షాక్‌కు గురయ్యారని… ప్రజల కోపాన్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని అబ్దుల్లా తెలిపారు. ఈ పరిణామంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని అబ్దుల్లా హామీ ఇచ్చారు.
‘‘అతి దారుణం! పవిత్ర రంజాన్ మాసంలో గుల్మార్గ్‌లో అశ్లీల ఫ్యాషన్ షో నిర్వహించడం దారుణం. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్‌గా మారాయి. వీటి వల్ల ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. సూఫీ, సాధు సంస్కృతి, ప్రజల మతపరమైన దృక్పథానికి పేరుగాంచిన లోయలో దీన్ని ఎలా సహించాలి? ఇందులో పాల్గొన్న వారిని వెంటనే జవాబుదారీగా చేయాలి.’’ అని సీనియర్ మతాధికారి మిర్వైజ్ పేర్కొన్నారు.