Fahad Ahmad: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) నాయకుడు, వివాదాస్పద బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్‌కి పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. ఎన్సీపీ(ఎస్పీ) యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జితేంద్రం అహ్వాద్ సిఫారసు మేరకు శరద్ పవార్, సుప్రియా సూలే ఆమోదం పొందిన తర్వాత ఫహద్ అహ్మద్ పార్టీ యూత్ జాతీయాధ్యక్షుడిగా నియమితులైనట్లు ఎన్సీపీ(ఎస్పీ) ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీ చేసిన ఫహద్, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన సనా మాలిక్ చేతిలో అణుశక్తి నగర్ స్థానం నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన కొన్ని నెలల తర్వాత ఆయనకు ఈ పదవి లభించింది. నవంబర్, 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లకు 2 రోజుల ముందు ఫహద్ అహ్మద్‌ని శరద్ పవార్ వర్గం బరిలోకి దింపింది.
Read Also: IMD: 124 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రికార్డ్ ఉష్ణోగ్రతలు.. మార్చిలో నిప్పుల కొలిమి..
ఎన్సీపీ అజిత్ పవార్ కుమార్తె సనా మాలిక్‌పై అహ్మద్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఫహాద్ 45,963 ఓట్లు సాధించగా, సనా మాలిక్ 49,341 ఓట్లు సాధించడంతో, 3,378 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తన ఫలితాన్ని తారుమారు చేసిందని, తిరిగి ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేశారు. 17 రౌండ్ల కౌంటింగ్ తర్వాత అనుశక్తి నగర్‌లో తాను ముందంజలో ఉన్నానని అహ్మద్ పేర్కొన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో (EVM) వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఇతడి భార్య స్వరా భాస్కర్ యాంటీ-బీజేపీగా ముద్ర పడింది. ఆమె చేసే కొన్ని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడం గతంలో జరిగింది. ఇటీవల కుంభమేళా, ఛావా సినిమాల గురించి కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.