Site icon NTV Telugu

Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహ‌నాల వరుస ప్రమాదాలు.. కేంద్రం సీరియస్‌

Nitin Gadkari

Nitin Gadkari

మండిపోతున్న పెట్రో ధరలతో క్రమంగా ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.. అయితే, దేశవ్యాప్తంగా ఈ మధ్యే.. పలు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.. ఇంట్లో చార్జింగ్‌ పెట్టిన సమయంలోనే కొన్ని.. రోడ్లపై మరికొన్ని ప్రమాదాలు గురయ్యాయి.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్‌ అయ్యారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. ఆయా వాహ‌నాల కంపెనీల‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు గడ్కరీ.. లోపాలున్న వాహ‌నాల‌ను త‌క్షణ‌మే రీకాల్ చేయాల‌ని ఆదేశించారు.. అంతేకాకుండా ఇప్పటిదాకా చోటుచేసుకున్న ప్రమాదాల‌పై విచార‌ణ జ‌రిపి.. ఆయ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: Gudivada Amarnath: ఆ విషయం తెలిస్తే చంద్రబాబుకి గుండె ఆగిపొద్దేమో..!

కాగా, గత రెండు నెలలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి.. దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.. ప్రమాదాలపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతుందని, సంబంధిత కంపెనీలపై భారీ జరిమానాలు విధించడం, ఇతర చర్యల గురించి కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.. గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అనేక ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం మరియు పలువురు గాయపడటం అత్యంత దురదృష్టకరం అన్నారు గడ్కరీ.. ఈ సంఘటనలపై విచారణ మరియు నివారణ చర్యలపై సిఫార్సులు చేయడానికి మేము నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని ట్వీట్‌ చేశారు..

అయితే, ఈ నెల ప్రారంభంలో, ఓలా ఈ-స్కూటర్ మంటల్లో చిక్కుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.. దీనిపై విచారణను ప్రారంభించింది ప్రభుత్వం… స్టార్టప్ ప్యూర్ ఈవీకి చెందిన స్కూటర్ కూడా మంటల్లో చిక్కుకుంది, ఇక, ఒకినావా ఆటోటెక్ ప్రైవేట్ బైక్ దగ్ధమై ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. కాగా, నివేదికల ఆధారంగా, మేం డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఆదేశాలు జారీ చేస్తాం. మేం త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం నాణ్యత-కేంద్రీకృత మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు గడ్కరీ.. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధించబడుతుంది. అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయడానికి కూడా ఆదేశిస్తామని స్పష్టం చేశారు.

Exit mobile version