EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం

  • పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
  • అమల్లోకి కొత్త ఈపీఎఫ్ నిబంధనలు
  • ఉద్యోగులకు ఇక పండగే.. పండగ
Epf

Epf

ఉద్యోగుల భవిష్యనిధి (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. దాదాపు 74 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈపీఎఫ్ స్కీమ్-1952 స్థానంలో ఈపీఎఫ్ స్కీమ్-2026ను అమల్లోకి తీసుకొచ్చింది. జూన్ 29న గెజిట్‌లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది ఈపీఎఫ్‌వో సభ్యులకు ఈ మార్పులు వర్తించనున్నాయి. కొత్త నిబంధనలతో ఈపీఎఫ్ వ్యవస్థ మరింత సరళంగా, డిజిటల్‌గా, పారదర్శకంగా మారనుందని ప్రభుత్వం తెలిపింది.

కొత్త స్కీమ్‌లో అత్యంత కీలకమైన మార్పు ఉద్యోగుల తప్పనిసరి పీఎఫ్ చందాకు సంబంధించినది. ప్రస్తుతం చట్టబద్ధమైన వేతన పరిమితి నెలకు రూ.15,000గా ఉంది. దీంతో ఉద్యోగి చెల్లించాల్సిన తప్పనిసరి పీఎఫ్ చందా 12 శాతం.. అంటే నెలకు రూ.1,800 మాత్రమే అవుతుంది. యజమాని కూడా అంతే మొత్తాన్ని తన వాటాగా చెల్లిస్తారు. అంతకుముందు కొన్ని సంస్థల్లో ఉద్యోగుల వాస్తవ వేతనంపై కూడా పీఎఫ్ చందా లెక్కించి ఎక్కువ మొత్తాలు జమ చేసేవారు. అయితే కొత్త నిబంధనల్లో రూ.1,800 వరకు మాత్రమే తప్పనిసరి చందా అని స్పష్టంగా పేర్కొన్నారు.

ఉద్యోగులు తమ పదవీ విరమణ నిధిని మరింత పెంచుకోవాలనుకుంటే రూ.1,800 కంటే ఎక్కువ మొత్తాన్ని కూడా పీఎఫ్‌లో జమ చేసుకునే అవకాశం కొనసాగుతుంది. అయితే ఆ అదనపు మొత్తం ఇకపై స్వచ్ఛంద పీఎఫ్‌గా పరిగణిస్తారు. అయితే ఈ అదనపు చందాకు యజమాని సమానంగా డబ్బు జమ చేయాల్సిన బాధ్యత ఉండదు. సంస్థ పాలసీ లేదా ఉద్యోగ ఒప్పందంలో ప్రత్యేకంగా పేర్కొంటే మాత్రమే యజమాని అదనపు వాటా చెల్లిస్తారు.

మార్పుల్లేవు

కొత్త స్కీమ్ వచ్చినప్పటికీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఇప్పటిలాగే 12 శాతం చొప్పున చందా చెల్లిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 శాతం చందా చెల్లిస్తున్న సంస్థలకు అదే విధానం కొనసాగుతుంది. ఈపీఎఫ్ స్కీమ్-2026లో పీఎఫ్ డబ్బు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే నిబంధనలను కూడా సరళీకరించారు. అనేక కేటగిరీల స్థానంలో మూడు ప్రధాన విభాగాలుగా మార్చారు. వైద్య అవసరాలు, విద్య, వివాహం, గృహ నిర్మాణం లేదా ఇంటి కొనుగోలు వంటి అవసరాలు, అలాగే ప్రత్యేక పరిస్థితుల్లో నిర్దేశిత నిబంధనల ప్రకారం పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

డిజిటల్ సేవలకు ప్రాధాన్యం

కొత్త ఈపీఎఫ్ స్కీమ్‌లో డిజిటల్ సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఆన్‌లైన్ క్లెయిమ్‌లు, ఈ-పాస్‌బుక్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారిత సేవలు, ఎలక్ట్రానిక్ ఫైలింగ్ వంటి సేవలను మరింత బలోపేతం చేయనున్నారు. దీంతో ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వేగంగా, పారదర్శకంగా సేవలు పొందే అవకాశం ఉంటుంది.

ప్రయోజనం ఏమిటి?

కొత్త ఈపీఎఫ్ స్కీమ్‌తో ఉద్యోగుల పీఎఫ్ చందా రేటు లేదా పదవీ విరమణ ప్రయోజనాల్లో ఎలాంటి కోత లేదు. తప్పనిసరి, స్వచ్ఛంద చందాల మధ్య స్పష్టత తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. పదవీ విరమణ సమయంలో ఎక్కువ నిధి కావాలనుకునే ఉద్యోగులు ఇప్పటికీ అదనపు చందా చెల్లించవచ్చు. అయితే ఆ అదనపు మొత్తానికి యజమాని తప్పనిసరిగా సమానంగా చెల్లించాల్సిన అవసరం లేదని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.