అస్సాంలో ఏనుగులను ఢీకొట్టడంతో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటన అస్సాంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు రైల్వే పట్టాలపైకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే లోకో పైలట్ స్పందించి వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని లమ్డింగ్ డివిజన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జమునాముఖ్ – కాంపూర్ సెక్షన్ మధ్య సైరాంగ్ – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపు పట్టాలపైకి వచ్చింది. వేగంగా దూసుకెళ్తున్న రైలు ఆ గుంపును ఢీకొట్టడంతో ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. అలాగే ఈ ఘటనలో ఏనుగుల మృతిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
