Election Commission: హర్యానాలో ఓట్ల దొంగతనం జరిగినట్లు రాహుల్ గాంధీ బుధవారం భారత ఎన్నికల కమిషన్(ECI) తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. కాంగ్రెస్ నేత ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్(SIR) కు మద్దతు ఇస్తున్నారా.? లేక వ్యతిరేకిస్తున్నారా.? అని ప్రశ్నించింది. సర్ ద్వారా ఈసీ నకిలీ, చనిపోయిన, వేరే ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను తొలగిస్తుంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా జరిగిందని అన్నారు.
హర్యానాలో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్ల ద్వారా 25 లక్షల ఓట్లు దొంగిలించబడ్డాయని ఆయన ఆరోపించారు. ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, హర్యానాలో ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా ఎలాంటి అప్పీళ్లు దాఖలు కాలేదని ఈసీ స్పష్టం చేసింది. పంజాబ్-హర్యానా హైకోర్టులో 22 ఎన్నికల పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
Read Also: Pawan Kalyan : రూ.150 కోట్లు వదులుకున్న పవన్ కల్యాణ్.. గొప్పోనివయ్యా
ఎన్నికల సంఘం కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లను ప్రశ్నించింది. ఒక ఓటరు అప్పటికే ఓటు వేసి ఉన్నా, ఓటర్ గుర్తింపుపై ఏదైనా సందేహం ఉన్న అభ్యంతరాలు వ్యక్తం చేయాలి కదా అని కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల పనితీరును ప్రశ్నించింది. ఇప్పటి వరకు దీనిపై కాంగ్రెస్ బూల్ లెవల్ ఏజెంట్లు ఎలాంటి వాదనల్ని అభ్యంతరాలను లేవనెత్తలేదని, ఈ విషయంలో వారు ఎలాంటి అప్పీళ్లు దాఖలు చేయలేదని ఈసీ ఎత్తిచూపించింది. నకిలీ ఓటర్లు ఉంటే, వారంతా బీజేపీకి మద్దతు ఇచ్చారని రాహుల్ గాంధీ ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదని ఈసీ వ్యాఖ్యానించింది. బదులుగా ఈ ఓటర్లు కాంగ్రెస్ కు ఓటు వేసి ఉండొచ్చు కదా అనే ప్రశ్నను లేవనెత్తింది.
రాహల్ గాంధీ చెబుతున్న ఇంటి నెంబర్ ‘జీరో’ ఓటర్ జాబితాలోని ఓటర్లకు పంచాయతీలు, మునిసిపాలిటీలు ఇంకా అధికారిక ఇంటి నెంబర్ కేటాయించని ఇళ్లకు చెందిన వారు అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బీహార్ ఎన్నికలకు ముందు ఈసీ సర్‌ని ప్రారంభించింది. తాజాగా 51 కోట్ల మంది ఓటర్ల అర్హత గుర్తించేందుకు 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం మంగళవారం సర్ ప్రారంభించింది. ఇది ప్రారంభించిన ఒక రోజు తర్వాత రాహుల్ గాంధీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
