Anil Ambani: మనీలాండరింగ్ కేసులో భాగంగా రూ.17వేల కోట్ల రుణ మోసాలకు సంబంధించి ప్రశ్నించేందుకు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన మంగళవారం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని అధికారుల ముందు హాజరయ్యారు. కేసులో భాగంగా అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని ఈడీ (ED) నమోదు చేయనుంది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఇందులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రూ.5,901 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ రూ.8,226 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించి రూ.4,105 కోట్ల రుణాలు ఉన్నాయి.
Read Also: Former MLA Narsa Reddy: మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..
అయితే, గత నెల 24 నుంచి మూడు రోజుల పాటు రిలయన్స్ గ్రూప్‌కు చెందిన 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. అనంతరం అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ (ఎల్డీసీ)ను కూడా ఇచ్చిన విషయం విదితమే. ఈ సోదాల్లో ఈడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే కేసులో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్లకు కూడా సమన్లు జారీ అయ్యాయి. సమన్లు జారీ అయిన వారిలో అమితాబ్ ఝున్జున్వాలా, సతీశ్ సేథ్ సహా గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
