Site icon NTV Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ ఈడీ సమన్లు.. ఎల్లుండి రావాలని నోటీస్

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం కేసులో ఆయనకు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. తాజాగా మళ్లీ ఐదోసారి సమన్లు పంపించింది. ఫిబ్రవరి 2 విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆయా కారణాలతో పలుమార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈసారి మాత్రం విచారణకు హాజరుకాకపోతే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఆప్‌ను బలహీనపర్చేందుకే కేంద్రం ఈడీని పావుగా వాడుకుంటోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. గత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. తాజాగా మరోసారి శుక్రవారం విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు డుమ్మాకొట్టారు. ఈసారి హాజరుకాకపోతే మాత్రం అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Breaking: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు కోర్టు అనుమతి

లిక్కర్ కేసులో గత ఏప్రిల్‌లో దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్‌ను విచారించింది. కానీ నిందితుడిగా మాత్రం చేర్చలేదు. కానీ ఇదే కేసులో ఆప్ ముఖ్య నేతలు ఎంపీ సంజయ్‌సింగ్‌, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియా, అక్టోబర్‌లో సంజయ్‌సింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావడంతో ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ వెంటాడుతోంది. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు ఆప్‌ పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈడీని వాడుకుంటుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బుధవారం ఈడీ ముందు హేమంత్ హాజరయ్యారు. విచారణ అనంతరం సోరెన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు విపక్షాలను ఇరుకున పెట్టేందుకు బీజేపీ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version