NTV Telugu Site icon

Earthquake:| జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో భూకంపం

Earthquake

Earthquake

Earthquake:|ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. సుందరమైన జమ్ముకశ్మీర్‌లోని ప్రజలు వరుస భూకంపాలతో బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి కశ్మీర్‌లో భూకంపాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయకంపితులవుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో మంగళవారం దోడా ప్రాంతంలో భూకంపం సంభవించగా, బుధవారం తెల్లవారుజామున కత్రాకు దగ్గరలో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రెక్టర్‌ స్కేల్‌పై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 లోతులో ప్రకంపనలు సంభవించినట్టు ఎన్‌సీఎస్‌ పేర్కొంది.

Read also: Pawan kalyan Varahi Yatra: నేటి నుంచే పవన్‌ కళ్యాణ్ వారాహి యాత్ర.. షెడ్యూల్ ఇదే!

కశ్మీర్‌లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌‌, హర్యానా, పంజాబ్‌, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూకంప తాకిడికి జమ్ముకశ్మీర్‌లో పలు ఇండ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. దోడాలోని ఓ సబ్‌ డిస్ట్రిక్‌ హాస్పిటల్‌లో రోగులకు గాయాలయ్యాయి. ఈనెల 11న 3.2 తీవ్రతతో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లాలో, జూన్‌ 9న కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో 3.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపాలు సంభవించినప్పటి వీడియోలను కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.