NTV Telugu Site icon

గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంతంటే?

ఒకవైపు దీపావళి పండుగ.. మరోవైపు పండుగ సందడి వేళ గుజరాత్ లోని ద్వారక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ మధ్య కాలంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో.. గుజరాత్ ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. పండుగ వేళ ఈ భూకంపం ఏంటో అని జనం ఆందోళన చెందారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినట్టు సమాచారం అందలేదు.