NTV Telugu Site icon

Honey Trap Case: భారత క్షిపణి రహస్యాలు పాకిస్తాన్ చేరవేసిన డీఆర్డీఓ సైంటిస్ట్..

Drdo Scientist

Drdo Scientist

Honey Trap Case: డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వలపువలతో చిక్కుకున్నాడు. ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జరా దాస్‌గుప్తా అనే పేరుతో ప్రదీప్ కురుల్కర్ ను హనీట్రాప్ చేశారు. ఆమెతో చాట్ చేస్తూ, ఆమె మాయలో పడిపోయాడు. భారత రక్షణకు సంబంధించి సున్నిత సమాచారాన్ని ఆమెకు అందించినట్లు తెలుస్తోంది. క్లాసిఫైడ్ డిఫెన్స్ ప్రాజెక్టులోని భారత క్షిపణి వ్యవస్థల గురించి ఆమెతో చాట్ చేసినట్లు చార్జీషీట్ లో పేర్కొన్నారు.

పూణెలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) ల్యాబ్‌లలో ఒకదానికి డైరెక్టర్‌గా ఉన్న కురుల్కర్‌పై మహారాష్ట్ర పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) గత వారం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అధికార రహస్యాల చట్టం కింద మే 3న గూఢచర్యానికి పాల్పడినందకు కురుల్కర్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ప్రదీప్ కురుల్కర్, జరా దాస్ గుప్తాతో వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ ద్వారా సంప్రదించినట్లు ఛార్జిషీట్ పేర్కొంది.

Read Also: Flesh Eating Bacteria: దోమల్లో మాంసాన్ని తినే బ్యాక్టీరియా..పలు దేశాల్లో గుర్తింపు

యూకేలో ఉంటున్నానని చెబుతూ జరా దాస్ గుప్తా తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని సంప్రదించి కురుల్కర్ ను ఆకర్షించేందుకు అందమైన, అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు పంపేది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. అయితే ఆమె ఐపీ అడ్రస్ మాత్రం పాకిస్తాన్ కు చెందినదిగా తేలిందని ఏటీఎస్ అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, UCV, అగ్ని క్షిపణి లాంచర్, బ్రిడ్జింగ్ సిస్టమ్‌కు సంబంధించిన రహస్య మరియు సున్నితమైన సమాచారాన్ని పొందడానికి పాకిస్తాన్ ఏజెంట్ ప్రయత్నించిందని తెలుస్తోంది.

ఆమెకు ఆకర్షితుడైన ప్రదీప్ కురుల్కర్ డీఆర్డీఓ సున్నిత, రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత ఫోన్ లో భద్రపరుచుకుని జరాతో పంచుకున్నాడు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లు, బ్రహ్మోస్, అగ్ని క్షిపణి లాంచర్లు వంటి వివిధ ప్రాజెక్టుల గురించి ఆమెతో చాట్ చేశాడు. ఏటీఎస్ వర్గాల ప్రకారం వీరిద్దరు జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు కాంటాక్ట్ లో ఉన్నారు. జరా కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన ప్రదీప్ ఫిబ్రవరిలో జరా నంబర్ ని బ్లాక్ చేశాడు. ఆ తరువాత జరా వేరే భారతీయ నంబర్ నుంచి ‘మీరు నా నంబర్ ఎందకు బ్లాక్ చేశారు..?’ అని వాట్సాప్ మెసేజ్ చేసింది. చాట్ రికార్డులు, వ్యక్తిగత షెడ్యూల్, లొకేషన్ వివరాలను ఎవరితో పంచుకోకూడదని తెలిసినప్పటికీ.. ఆమెతో పంచుకున్నట్లు ఏటీఎస్ అధికారులు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.