NTV Telugu Site icon

డాక్ట‌ర్ రెడ్డీస్ గుడ్‌న్యూస్‌.. సింగిల్ డోస్‌ వ్యాక్సిన్‌..!

Sputnik Light

క‌రోనాకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడు మ‌న‌ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌నే అని వైద్య‌నిపుణులు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు.. అయితే, ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు మాత్రం.. రెండు డోసులు తీసుకోవాలి.. మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత వ్యాక్సిన్ ప్రొటోకాల్‌ను అనుస‌రించి రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. మ‌రోవైపు.. ఒక్క వ్యాక్సిన్‌తో ప‌నిముగించే సంస్థ‌లు కూడా ఉన్నాయి.. ఈ నేప‌థ్యంలో భార‌తీయ ఫార్మా దిగ్గ‌జం డాక్ట‌ర్ రెడ్డీస్ గుడ్‌న్యూస్ చెప్పింది.. రష్యాకు చెందిన సింగిల్‌ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ లైట్‌ టీకాను భార‌త్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జ‌రుపుతోంది.. గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ఈ సింగిల్-డోస్ వ్యాక్సిన్‌ను ఇప్ప‌టికే ర‌ష్యా ఆమోదం తెలిపింది.. దీంతో, అనేక దేశాలలో ట్రయల్స్ కూడా సాగుతున్నాయి..

ఈ సింగిల్ డోస్ టీకాను వీలైనంత త్వ‌ర‌గా అందుబాటులోకి తేవాల‌ని భారత్‌ భావిస్తోంది. ఇందుకు రష్యా తయారీదారు, దాని భారతీయ భాగస్వామ్య కంపెనీలతో సహా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నియంత్రణ సంస్థ అధికారులను ఇటీవల ఆదేశించింది కేంద్ర ప్ర‌భుత్వం.. అన్ని అనుకూలిస్తే.. భార‌త్‌లో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్‌ డోస్‌ టీకా స్పుత్నిక్‌-వీ లైట్ కానుంది. మ‌రోవైపు.. ఇప్ప‌టికే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ అత్యవసర ఉపయోగానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీజఐ) నుండి ఇప్ప‌టికే ఆమోదం ల‌భించ‌గా.. దాని భార‌తీయ భాగ‌స్వామి అయిన‌ డాక్టర్ రెడ్డీస్ లాబ్స్‌ ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటోంది. కాక‌పోతే ఇది రెండు డోసుల వేయాల్సిందే.. దీనిపై ఓవైపు క‌స‌ర‌త్తు చేస్తూనే.. సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం కూడా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది డాక్ట‌ర్ రెడ్డీస్..