Shivraj Singh Chouhan: భారత్‌పై అదనపు సుంకాలను అమెరికా అమలు చేయడంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా మండిపడ్డారు. ట్రంప్ విధించే పన్నులకు భారతీయులు భయపడొద్దని సూచించారు. ఈ సందర్భంగా స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన టార్గెట్.. మన జీవితంలో అవసరమైన అన్ని వస్తువులను మన దగ్గర తయారైనవే కొనాలి అని సూచించారు. వాటిలో మన ఐక్యతను, నిజమైన భారతీయుడిగా నిరూపించుకోవాలని చౌహాన్ పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: పేదోళ్ల ఓట్లే తొలగించారు.. మరిన్ని ఆధారాలు బయటపెడతా
ఇక, 144 కోట్ల జనాభా భారతదేశం యొక్క బలం.. ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయి.. మన ప్రజలకు మాత్రమే కాదు, అవసరమైతే ప్రపంచానికీ కూడా అన్నం పెట్టే సామర్థ్యం మనకు ఉందని చెప్పుకొచ్చారు. శాస్త్రవేత్తలు, రైతులు, వ్యాపారులు, యువ శక్తితో భారత్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు తీసుకెళ్తాం అని స్పష్టం చేశారు. మరోవైపు, రష్యా ముడి చమురు కొనుగోళ్ల సాకుతో భారత్ పై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు సుమారు 50 శాతం సుంకాలు విధించారు. ఇండియాతో పాటు దాదాపు 70 దేశాలపై విధించిన టారీఫ్స్ అమల్లోకి వచ్చాయి.
