CM Vijay vs DMK: సీఎం విజయ్‌-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..

Anitha Radhakrishnan Arrest

Anitha Radhakrishnan Arrest

CM Vijay vs DMK: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకే వివాదం మరో కీలక మలుపు తిరిగింది. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో ఆత్తూరు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. జూన్ 20న తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన ఒక పార్టీ బహిరంగ సభలో అనితా రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఆ సమయంలో తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ హావభావాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. “తాను రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయానని విజయ్ బాధపడుతున్నారు. అసెంబ్లీలో ఆయన ముఖం చూస్తే ఆ విషయమే స్పష్టమవుతోంది. ఇల్లు, సినిమా ఇండస్ట్రీలోనే నటి త్రిషతో ఎంతో సంతోషంగా గడిపిన రోజులను బహుశా ఆయన గుర్తుచేసుకుంటున్నారేమో” అంటూ వ్యక్తిగత జీవితాన్ని లాగుతూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని టీవీకే పట్టణ కార్యదర్శి సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై చట్టప్రకారం కేసులు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో అనితా రాధాకృష్ణన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది. “మీరు సామాన్య పౌరుడు కాదు, ఒక ప్రజాప్రతినిధి. పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రికి కనీస గౌరవం ఇవ్వాల్సిందే” అని కోర్టు స్పష్టం చేసింది. 1967 నుంచి తమిళనాడు ప్రజలు సినీ రంగం నుంచి వచ్చిన నేతలను గెలిపిస్తున్నారని, అలాంటప్పుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఇక, ​కోర్టు ఆదేశాలు వెలువడిన కొద్దిసేపటికే, ఆత్తూరు మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే శ్రేణులు పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడంతో స్థానికంగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రస్తుతానికి ఆయనను ఎస్పీ ఆఫీసుకు తరలించి తదుపరి విచారణ జరుపుతున్నారు. సీఎం విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకే ముఖ్య నేత ఒకరు ఇలా అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.