NTV Telugu Site icon

Digvijay Singh: కేసీఆర్, జగన్‌లపై సెటైర్లు.. గులాంపై గుర్రు

Digvijay On Kcr Jagan

Digvijay On Kcr Jagan

Digvijay Singh Satires On CM KCR and CM YS Jagan: భారత్ జోడో యాత్ర కోసం కన్యాకుమారికి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్.. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద సెటైర్లు వేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వకుంటే, కేవలం ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీ తెచ్చేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే, టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీన్ చేస్తానని అప్పట్లో కేసీఆర్ మాటిచ్చారని.. కానీ ఎక్కడ చేశాడని నిలదీశారు. కేసీఆర్ తమ కాంగ్రెస్ వ్యక్తేనని, తమతో జత కట్టొచ్చు కదా అని అడిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా కష్టపడుతున్నారని, రాహుల్ గాంధీ చేపట్టడిన భారత్ జోడో యాత్ర వల్ల తెలంగాణలో మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.

ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి దిగ్విజయ్ మాట్లాడుతూ.. జగన్ తమ రాజశేఖర్ రెడ్డి కొడుకేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుడు కావడం వల్లే జగన్‌ను ఏపీ ప్రజలు ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పారు. అయితే.. తాము కేసులు పెట్టామని జగన్ కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇటీవల కాంగ్రెస్‌ని వీడిన గులాం నబీ ఆజాద్‌పై దిగ్విజయ్ విరుచుకుపడ్డారు. అతడో నమ్మకద్రోహి అని.. పదువులు అన్ని అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్‌ను, రాహుల్‌ని తిడుతున్నాడని ఫైరయ్యారు. తామిద్దరం కలిసి ఒకేసారి 1977లో కాంగ్రెస్ చేరామని, పదవులు లేకపోతే గులాం నబీ ఉండడని తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని గులాం నబీ చెప్పడం సిగ్గుమాలిన పని అని విమర్శించారు. G-23, సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న గులాంనను రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ గౌరవించారని వెల్లడించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను రాజకీయ కోణంలో చూడొద్దని దిగ్విజయ్ సింగ్ కోరారు. ఇది దైశాన్ని ఐక్యం చేసే యాత్ర అని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు భారతదేశాన్ని కులాలు, మతాల పేరుతో విడదీశారని.. భారత్‌ను ఏకం చేయగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో పాదయాత్ర లేనంత మాత్రానా, తాము అక్కడ లేమనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. మోదీ మన దేశాన్ని రెండు కార్పోరేట్ కంపెనీలకు అమ్మేశాడని, పేదలను బతికించేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

Show comments