NTV Telugu Site icon

Nirmala Sitharaman On Obama: ముస్లిం దేశాలపై బాంబులు వేయలేదా?.. ఒబామా వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ కౌంటర్

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman On Obama: మైనారిటీ హక్కుల గురించి మాట్లాడిన అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌ ఫైర్‌ అయ్యారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముస్లిమ్‌ దేశాలపై బాంబులతో దాడి చేయలేదా? అని ప్రశ్నించారు. తాను చేస్తే ఒకరకంగా.. మరొకరు చేస్తే ఇంకొక రకంగా మాట్లాడటం సరికాదన్నారు. భారత్‌లో మైనార్టీల హక్కులపై ప్రధాని మోదీని అమెరికా మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రధాని చెప్పిన సమాధానాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆరు ముస్లిం దేశాలపై బాంబుల వర్షం కురిపించలేదా? అని ప్రశ్నించారు.

Read also: CM YS Jagan: న్యాయవాదులకు తోడుగా నిలిచాం.. ప్రభుత్వం తరఫునుంచి మేం కోరేది ఒక్కటే

తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడితే.. భారత్‌లోని మైనార్టీ హక్కుల గురించి ప్రస్తావిస్తానని.. వారి హక్కులను పరిరక్షించలేకపోతే భారత్‌ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత ప్రధాని అమెరికాలో పర్యటిస్తూ తన దేశం గురించి అక్కడ చెబుతున్న సమయంలో ఒబామా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ.. ఒబామా వ్యాఖ్యలపై స్పందించేందుకు నేను చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది అమెరికా, భారత్‌తో ముడిపడి ఉన్న అంశం. మేం వారితో స్నేహం కోరుకుంటున్నాం.. కానీ, అక్కడ కూడా భారత్‌లో మతస్వేచ్ఛ, మైనార్టీల హక్కుల గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. బరాక్‌ ఒబామా హయాంలో ఆరు ముస్లిం దేశాలపై బాంబులతో విరుచుకుపడలేదా? 26,000 బాంబులను ప్రయోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వ్యక్తి మాటలను ఎవరైనా విశ్వసిస్తారా? అని సీతారామన్‌ వ్యాఖ్యానించారు.సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అన్నదే తమ ప్రభుత్వ విధానమని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ సైతం అమెరికాలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారని సీతారామన్‌ గుర్తు చేశారు. అంతేగాని మత వివక్ష గురించి ఆయన మాట్లాడలేదని తెలిపారు. కానీ ఆ చర్చలో పాల్గొన్నవారు మాత్రం ఈ విషయాన్ని పక్కనబెట్టి సమస్యలు కాని వాటిని బూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతేకాదు, ప్రధాని మోదీకి వచ్చిన దాదాపు 13 విదేశీ అవార్డుల్లో 6 అవార్డులు ముస్లిం జనాభా ఎక్కువ దేశాల నుంచే వచ్చాయని గుర్తు చేశారు.

Read also: Vemula Prashanth Reddy: నడ్డా ఇది కేసిఆర్ అడ్డా.. నోరు అదుపులో పెట్టుకో బిడ్డా

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై కూడా నిర్మలాసీతారామన్‌ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రానికి వ్యతిరేకంగా తాము గెలవలేమని భావించిన కొందరు.. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు, అసందర్భ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. మైనార్టీల హక్కులను మెరుగుపరచడానికి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి ప్రధాని బదులిస్తూ మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మన రక్తంలో ప్రజాస్వామ్యం నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. అది మన రాజ్యాంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే.. ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్ష అనే ప్రశ్నకు తావులేదని ప్రధాని స్పష్టం చేశారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ అనే నినాదం మీదే మా ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. మతం, కులం, వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారని తెలిపారు.